Omicron: BCCI To Take Special Permission From Government For SA Tour: దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (బి.1.1.529) వెలుగు చూసిన నేపథ్యంలో టీమిండియా పర్యటనపై సందిగ్దత నెలకొంది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టు సౌతాఫ్రికా టూర్‌కు వెళ్లేందుకు షెడ్యూల్ ఖరారైన సంగతి తెలిసిందే. డిసెంబరు 17 నుంచి జనవరి 26 వరకు మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ సహా.. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్.. నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది.
ఈ క్రమంలో ఒమిక్రాన్ కేసులు బయటపడటం ఆందోళనకరంగా పరిణమించింది. ఇప్పటికే అమెరికా, బ్రెజిల్, కెనడా, జపాన్, థాయిలాండ్, యూరోపియన్ యూనియన్, యూకే తదితర దేశాలు దక్షిణాఫ్రికా ఖండానికి చెందిన దేశాల నుంచి విమానప్రయాణాలపై ఆంక్షల విధించాయి. ఇప్పటికిప్పుడు కాకపోయినా ఒమిక్రాన్ ఉధృతి పెరిగినట్లయితే భారత్ కూడా ఆంక్షలు విధించే అవకాశం లేకపోలేదు. దీంతో టీమిండియా దక్షిణాఫ్రికా టూర్ రద్దయ్యే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కోశాధికారి అరుణ్ ధుమాల్ ఈ విషయంపై స్పందించారు. ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘ఇరు దేశాల బోర్డు సభ్యులు టచ్‌లో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాం. ఆటగాళ్లు రక్షణే మా ప్రథమ ప్రాధాన్యం. అయితే, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించినట్లయితే.. భారత ప్రభుత్వ అనుమతితోనే అక్కడికి వెళ్తాం.
అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాలని భావిస్తున్నాం. ప్రస్తుతం ఏ క్రికెట్ బోర్డు అయినా సరే ఆ దేశ ప్రభుత్వాల నిర్ణయాలకు అనుగుణంగానే నడుచుకుంటుంది. మేము కూడా అంతే. కేంద్ర ప్రభుత్వ విధానాల ప్రకారం నడుచుకుంటాం. మా విజ్ఞప్తిని స్వీకరిస్తే ప్రత్యేక అనుమతితో వెళ్లే అవకాశం ఉంటుంది. తుది నిర్ణయం మాత్రం ప్రభుత్వానిదే’’ అని స్పష్టం చేశారు. కాగా భారత ‘ఏ’ జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.
దక్షిణాఫ్రికా వర్సెస్ ఇండియా 2021-22 షెడ్యూల్
►మొదటి టెస్టు- డిసెంబరు 17-21, జొహన్నస్‌బర్గ్.
►రెండో టెస్టు- డిసెంబరు 26-30, సెంచూరియన్
►మూడో టెస్టు- జనవరి 3-7, కేప్‌టౌన్
►మొదటి వన్డే- జనవరి 11, పర్ల్
►రెండో వన్డే- జనవరి 14, కేప్‌టౌన్
►మూడో వన్డే- జనవరి 16, కేప్‌టౌన్
►మొదటి టీ20- జనవరి 19, కేప్‌టౌన్
►రెండో టీ20- జనవరి 21, కేప్‌టౌన్
►మూడో టీ20- జనవరి 23, కేప్‌టౌన్
►నాలుగో టీ20- జనవరి 26, పర్ల్.
చదవండి: Ind Vs Nz Test- Srikar Bharat: ఆ క్యాచ్ నిజంగా సూపర్.. ఒకవేళ భరత్ పట్టుబట్టకపోయి ఉంటేనా!
Comments
Please login to add a commentAdd a comment