యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ పట్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి వ్యవహరిస్తున్న తీరుపై అతడి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విరాట్ కోహ్లి వంటి సీనియర్లకు, కిషన్ లాంటి యువ ఆటగాళ్లకు వేర్వేరు నిబంధనలు ఉంటాయా అని ప్రశ్నిస్తున్నారు. ఇందుకు కారణం ఏమిటంటే?!..
జట్టుతోనే ఉన్నా నో ఛాన్స్
గతేడాది కాలంగా జట్టులో పాటే ప్రయాణిస్తున్నా ఇషాన్ కిషన్‌కు తుదిజట్టులో చోటు కరువైంది. మూడు ఫార్మాట్లలో ఓపెనింగ్ బ్యాటర్ స్థానంలో శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ నుంచి.. వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ నుంచి ఈ జార్ఖండ్ ప్లేయర్ తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో అడపాదడపా మాత్రమే అవకాశాలు వస్తున్నాయి.
సౌతాఫ్రికా పర్యటన మధ్యలోనే స్వదేశానికి ఇషాన్
ఈ క్రమంలో సౌతాఫ్రికా పర్యటన నుంచి ఇషాన్ అకస్మాత్తుగా తిరిగి రావడం ప్రాధాన్యం సంతరించింది. మానసికంగా అలసిపోయానని.. అందుకే కొంతకాలం బ్రేక్ తీసుకోవాలని అతడు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. నిజానికి.. జట్టుతో పాటు ప్రయాణిస్తున్నా తగినంత ప్రాధాన్యం దక్కడం లేదనే ఆవేదనతో ఇషాన్ ఆటకు విరామం ఇవ్వాలని భావించినట్లు సమాచారం.
అప్పటి నుంచే బీసీసీఐతో విభేదాలు?
స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ నుంచే తనకు సెలవులు కావాలని ఇషాన్ అడిగినా.. మేనేజ్‌మెంట్ సానుకూలంగా స్పందించలేదని జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఎట్టకేలకు అతడి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని రిలీవ్ చేస్తే.. విశ్రాంతి తీసుకోకుండా దుబాయ్‌లో ట్రిప్ ఎంజాయ్ చేయడం ఏమిటని కొందరు బీసీసీఐ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వదంతులు వచ్చాయి.
అందుకే సెలక్ట్ చేయలేదా?
ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్ ఫ్యాన్స్- నెటిజన్లకు మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. వరల్డ్‌కప్-2024కు ముందు కీలకమైన అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌కు ఇషాన్ కావాలనే అందుబాటులో ఉండకపోవడం అతడి పొగరుబోతుతనానికి సూచిక అని కొంతమంది తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి ఆటిట్యూడ్ ఉన్న ఆటగాడిని ప్రపంచకప్ టోర్నీలో ఆడించాలనే ఆలోచన ఉంటే మానుకోవాలని సూచిస్తున్నారు.
ఇచ్చిన సెలవు ఎలా వాడుకుంటే వాళ్లకెందుకు?!
అయితే, ఇషాన్ కిషన్ అభిమానులు ఇందుకు ఘాటుగానే బదులిస్తున్నారు. ‘‘విరాట్ కోహ్లి తాను మానసికంగా అలసిపోయానని సుదీర్ఘకాలం విశ్రాంతి తీసుకుంటూ.. విదేశాలకు వెళితే తప్పు లేదు.. కానీ ఇషాన్ లాంటి వాళ్లు సెలవు అడిగి ట్రిప్‌నకు వెళ్తే నేరమా?
కావాలనే అఫ్గనిస్తాన్ సిరీస్ నుంచి తప్పించి.. పైగా అతడిపైనే నిందలు మోపడం సరికాదు. ఇచ్చిన సెలవును ఎలా వాడుకుంటే వాళ్లకెందుకు?’’ అని కౌంటర్ వేస్తున్నారు. దీంతో ఇషాన్ కిషన్ పేరు ఎక్స్ వేదికగా ట్రెండింగ్‌లోకి వచ్చింది.
అందుకే దుబాయ్‌కి వెళ్లిన ఇషాన్
కాగా తన సోదరుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు ఇషాన్ దుబాయ్‌కు వెళ్లడం గమనార్హం. ఇదిలా ఉంటే.. అఫ్గనిస్తాన్‌తో జనవరి 11 నుంచి టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇస్తున్నారు.
చదవండి: Ind Vs Afg: అఫ్గన్‌తో టీమిండియా సిరీస్: షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
Comments
Please login to add a commentAdd a comment