
రాజస్తాన్ రాయల్స్ (Photo Courtesy: BCCI/IPL)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) -2025లో రాజస్తాన్ రాయల్స్‌కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)తో ఆదివారం నాటి మ్యాచ్‌లో రాయల్స్ 44 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రాజస్తాన్ బౌలింగ్‌ను రైజర్స్ బ్యాటర్లు చితక్కొట్టారు. విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడి.. రాయల్స్ బౌలర్లకు పీడకల మిగిల్చారు.
ఫలితంగా ఆ జట్టు ఏకంగా 286 పరుగులు సాధించింది. అయితే, లక్ష్య ఛేదనలో రాయల్స్ 242 పరుగులకే పరిమితం కావడంతో ఓటమి తప్పలేదు. ఇక తమ రెండో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది.
ఇరుజట్లకు ఈ మ్యాచ్ కీలకం
గువాహతి వేదికగా బుధవారం కేకేఆర్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇక గత మ్యాచ్‌లో కోల్‌కతా (ఆర్సీబీ చేతిలో) కూడా ఓడిపోవడంతో ఇరుజట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది.
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజస్తాన్ రాయల్స్ బౌలర్ల వైఫల్యం కొనసాగితే మాత్రం ఆ జట్టుకు మరో ఓటమి తప్పదని అభిప్రాయపడ్డాడు.
ముఖ్యంగా విదేశీ పేసర్లు జోఫ్రా ఆర్చర్, ఫజల్‌హక్ ఫారూకీలను తుదిజట్టులో కొనసాగించే అంశంపై యాజమాన్యం తీసుకునే నిర్ణయమే కీలకం కానుందని పేర్కొన్నాడు.
4 ఓవర్లలో 76 రన్స్ ఇచ్చాడు.. జట్టులో అవసరమా?
‘‘బౌలింగ్ విభాగంలో రాజస్తాన్ రాయల్స్‌కు ఆందోళన తప్పదు. ముఖ్యంగా జోఫ్రాపైనే ప్రస్తుతం అందరూ దృష్టి పెట్టారు. నిజానికి రాయల్స్ జట్టులో ఆరుగురు విదేశీ ప్లేయర్లు ఉన్నారు. మిగతా జట్లలో ఎనిమిది మంది ఉన్నారు. అయితే, తమకున్న ఆరుగురిలో రాజస్తాన్ ఇద్దరు ఫాస్ట్ బౌలర్లను కలిగి ఉంది.
వాళ్లు గత మ్యాచ్‌లో ఆడారు. ఒకరేమో (జోఫ్రా) నాలుగు ఓవర్లలో ఏకంగా 76 పరుగులు ఇచ్చి ఐపీఎల్ చరిత్రలోనే నాసిరకమైన స్పెల్‌తో అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. మరొకరు ఫజల్‌హక్ ఫారూకీ.. జోఫ్రాతో పాటు అతడి బౌలింగ్‌నూ ప్రత్యర్థి బ్యాటర్లు చితక్కొట్టారు.
ప్రతి బౌలర్ కెరీర్‌లో ఎప్పుడో ఒకసారి ఇలాంటి చేదు అనుభవం ఉండటం సహజమే. అయితే, జట్టులో ఉన్న ఇద్దరు విదేశీ బౌలర్లు ఇలా ధారాళంగా పరుగులు ఇచ్చుకుంటే ఏం చేయాలన్న అంశంపై యాజమాన్యానికి స్పష్టత కొరవడుతుంది. వాళ్లిద్దరిలో ఒకరిపై వేటు వేస్తేనే బెటర్.
మఫాకాను ఆడించండి
సౌతాఫ్రికా యువ బౌలర్ క్వెనా మఫాకాను జోఫ్రా లేదంటే ఫారూకీ స్థానంలో ఆడించండి. అయినా సరే.. రాజస్తాన్ బౌలింగ్ విభాగం కచ్చితంగా రాణిస్తుందని చెప్పలేం’’ అని ఆకాశ్ చోప్రా సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు వెల్లడించాడు. ఇక రాజస్తాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ గురించి ప్రస్తావిస్తూ.. ఈసారి అతడు ఆరెంజ్ క్యాప్(అత్యధిక పరుగులు) సాధిస్తాడని అంచనా వేశాడు.
‘‘రాజస్తాన్ రాయల్స్ జట్టులో ఇద్దరు యువ ఆటగాళ్లు నా దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఒకరేమో కెప్టెన్ రియాన్ పరాగ్. మరొకరు యశస్వి జైస్వాల్. ఈసారి జైసూ ఆరెంజ్ క్యాప్ గెలుపొందినా ఆశ్చర్యం లేదు.
గత సీజన్‌లో అతడి ఫామ్ బాగాలేదు. అయినంత మాత్రాన ప్రతిసారి అలాగే ఉంటుందని భావించలేము’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
కాగా గత మ్యాచ్‌లో జైస్వాల్ ఐదు బంతులు ఎదుర్కొని కేవలం ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. మరోవైపు జోఫ్రా నాలుగు ఓవర్లలో ఏకంగా 76 పరుగులు ఇవ్వగా.. ఫారూకీ మూడు ఓవర్లు పూర్తి చేసి 49 రన్స్ సమర్పించుకున్నాడు. మహీశ్ తీక్షణ(2/52), సందీప్ శర్మ 2/51) పరుగులు ఇచ్చినా రెండేసి వికెట్లు తీయగలిగారు.
చదవండి: ఇదేం కెప్టెన్సీ గిల్? ఏమీ పట్టనట్టే ఉన్నావు ఎందుకు?: సెహ్వాగ్