కోచ్‌లపై అతిగా ఆధారపడొద్దు: రవిచంద్రన్‌ అశ్విన్‌ | Over-reliance on coaches can stop players from finding own solutions: Ashwin | Sakshi
Sakshi News home page

కోచ్‌లపై అతిగా ఆధారపడొద్దు: రవిచంద్రన్‌ అశ్విన్‌

Published Thu, Aug 22 2024 2:55 PM | Last Updated on Thu, Aug 22 2024 3:11 PM

Over-reliance on coaches can stop players from finding own solutions: Ashwin

కెరీర్‌లో ఎదగాలంటే సొంత బలాలు, బలహీనతలపై దృష్టి పెట్టాలని... ప్రతీదానికి కోచ్‌లను ఆశ్రయించే పనికి స్వస్తి చెప్పాలని భారత సీనియర్‌ ఆఫ్‌స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు. అలా చేయడం వల్ల యువ ఆటగాళ్లు కొత్తగా ఆలోచించడం మానేసి ఒక్క చోటనే ఆగిపోతారని అతను అభిప్రాయపడ్డాడు.

అవతలి వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఏదో నేర్చుకునే సాకుతో ‘అతుక్కుపోయే’ గుణం తనకు ఏమాత్రం నచ్చదని అశ్విన్‌ వ్యాఖ్యానించాడు. 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో మూడు ఫార్మాట్‌లలో కలిపి 744 వికెట్లు తీసిన అశ్విన్‌ పరిస్థితులకు తగినట్లుగా ఎప్పటికప్పుడు తన ఆటను మార్చుకోవడంలో అందరికంటే ముందుంటాడు.

‘చాలా మంది ఆటగాళ్లు కోచ్‌లు, మెంటార్‌లపై లేదా తమకు తెలిసిన ఎవరైనా మరో వ్యక్తిపై అతిగా ఆధారపడుతున్నారు. నా దృష్టిలో ఇది ప్రమాదకర సంప్రదాయం. ఎందుకంటే ఇలా ఇతరులను నమ్ముకునే వారు కొత్తగా ఆలోచించడం మరచిపోతారు’ అని అశ్విన్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

కోచ్‌లు శిక్షణ ఇచ్చే కోణంలో కూడా ఇది చేటు చేస్తుందని అతను చెప్పాడు. ‘సాధారణంగా అందరు కోచ్‌లు నీకేదైనా సమస్య ఉంటే దానికి పలు విధాలుగా పరిష్కారం చెప్పేందుకు ప్రయత్నిస్తారు.

అయితే ఒక ఆటగాడికి పని చేసిన సూత్రం మరో ఆటగాడి విషయంలో పని చేయదు. కానీ నేటి ఆధునిక తరహా కోచింగ్‌లో ఎవరూ దీనిని పట్టించుకోవడం లేదు. సందేహాలు ఉంటే రెండో వ్యక్తి వద్ద సలహా తీసుకోవడంలో తప్పు లేదు. కానీ నీ ఆటపై నీకు అవగాహన లేకుంటే, నీ లోపాలు నీవే గుర్తించలేకపోతే కష్టం. 

కోచ్‌ల వద్ద నేర్చుకునేవారు బాగుపడరని నేను చెప్పడం లేదు కానీ దీని వల్ల చాలా చోట్ల వెనుకబడిపోతారు’ అని అశ్విన్‌ వ్యాఖ్యానించాడు. తన కెరీర్‌ ఆరంభంలో మాజీ క్రికెటర్‌ డబ్ల్యూవీ రామన్‌ కోచ్‌గా ఉన్నా... తాను ఏ మార్గంలో వెళితే బాగుంటుందని చెప్పారే తప్ప ఫలానా తరహాలోనే ఉండాలని బలవంత పెట్టలేదని ఈ ఆఫ్‌స్పిన్నర్‌ అశ్విన్‌ గుర్తు చేసుకున్నాడు. గౌతమ్‌ గంభీర్‌తో తనకు మంచి సాన్నిహిత్యం ఉందన్న అశ్విన్‌... అతనితో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు.  

చాలా సమయం పట్టింది! 
అశ్విన్‌ బౌలింగ్‌ అమ్ముల పొదిలో ‘దూస్రా’ కూడా ఒక పదునైన బలం. దీనిని సమర్థంగా వాడి అతను ఎన్నో వికెట్లు పడగొట్టాడు. అయితే దూస్రాను నేర్చుకునేందుకు చాలా సమయం పట్టిందని అశ్విన్‌ వెల్లడించాడు.

 లంక స్పిన్నర్‌ అజంతా మెండిస్‌ వేసిన దూస్రా బంతులను చూసి స్ఫూర్తి పొందానని... దాదాపు మూడేళ్ల పాటు సాధన చేసిన అనంతరం నమ్మకం కుదిరాకే దేశవాళీ క్రికెట్‌లో దానిని తొలిసారి ఉపయోగించానని అతను చెప్పాడు. 

మరోవైపు ఐపీఎల్‌ కారణంగా యువ ఆటగాళ్లకు, పేరు, డబ్బు రావడం మంచి పరిణామమే అయినా... అందరికీ భారత్‌ తరఫున ఆడాలనేది తొలి లక్ష్యం కావాలని అశ్విన్‌ సూచించాడు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement