చెన్నై: ప్రపంచకప్‌లో మళ్లీ గెలుపుబాట పట్టాలని పాకిస్తాన్... మరో సంచలనంపై కన్నేసిన అఫ్గానిస్తాన్ సమరానికి సై అంటున్నాయి. బాబర్ ఆజమ్ బృందంతో పోల్చితే ఏ రకంగా చూసినా కూడా అఫ్గాన్ కూనే! అయితే ఈ ప్రపంచకప్‌లో భారత్, ఇంగ్లండ్‌లపై 270 పైచిలుకు పరుగులు చేయడం, మ్యాచ్‌ను పలుపు తిప్పే స్పిన్నర్లు ఉండటంతో హష్మతుల్లా షాహిది జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు.
ఇక పాక్ విషయానికే వస్తే వరుసగా భారత్, ఆ్రస్టేలియా చేతుల్లో ఓడిన జట్టుకు ఈ మ్యాచ్ కీలకం. గెలిస్తే సెమీఫైనల్ రేసులో నిలుస్తుంది. లేదంటే మరింత ఒత్తిడిలో కూరుకుపోతుంది. వరుసబెట్టి గెలవాల్సిన గడ్డు పరిస్థితులు ఎదురవొచ్చు. కాబట్టి అబ్దుల్లా షఫీక్, ఇమాముల్‌లతో కూడిన టాపార్డర్, రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తికార్‌లతో ఉన్న మిడిలార్డర్ బాధ్యతగా ఆడాలి. బౌలింగ్‌లో షాహిన్ అఫ్రిదికి మిగతా సీమ్ సహచరులు కూడా తోడైతే అఫ్గాన్‌ను ఆదిలోనే కట్టడి చేయొచ్చు.
మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌కు షాక్ ఇచ్చిన అఫ్గానిస్తాన్ తర్వాత రన్నరప్ న్యూజిలాండ్ చేతిలో ఓడింది. ఈ ఫలితం పక్కన బెడితే మ్యాచ్‌కు వేదికైన ఇక్కడి చెపాక్ పిచ్ స్పిన్‌కు కలిసొచ్చేది. అఫ్గాన్ జట్టులోని స్పిన్ వనరులకు (రషీద్, నబీ, ముజీబ్) ఈ పిచ్ సహకరిస్తే పాక్‌పై సంచలనం తప్పకుండా ఆశించవచ్చు. బ్యాటింగ్ దళం కూడా మెరుగ్గానే ఉంది. కెప్టెన్ హష్మతుల్లాసహా గుర్బాజ్, ఇబ్రహీమ్, రహ్మ త్ షాలు నిలకడగా ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో పాక్ ఏమాత్రం ఆదమరిచినా కష్టాలు తప్పవు.
జట్లు (అంచనా)
పాకిస్తాన్: బాబర్ ఆజమ్ (కెప్టెన్ ), షఫీక్, ఇమాముల్, రిజ్వాన్, షకీల్, ఇఫ్తికార్, నవాజ్, ఉసామ మీర్, షాహిన్ అఫ్రిది, హసన్ అలీ, రవూఫ్.
అఫ్గానిస్తాన్: హష్మతుల్లా (కెప్టెన్), గుర్బాజ్, ఇబ్రహీమ్, రహ్మత్ షా, ఒమర్జాయ్, ఇక్రామ్, నబీ, రషీద్ ఖాన్, ముజీబ్, నవీనుల్, ఫరూఖీ.
7 వన్డే ఫార్మాట్‌లో పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య ఏడు మ్యాచ్‌లు జరిగాయి. ఏడు మ్యాచ్‌ల్లోనూ పాకిస్తాన్ జట్టే గెలిచింది. ఈ రెండు జట్లు ప్రపంచకప్‌లో (2019) ఒకసారి తలపడ్డాయి. పాకిస్తాన్ జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment