photo credit: IPL Twitter
మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ తాత్కాలిక సారధి విరాట్ కోహ్లి కెప్టెన్‌గా సూపర్ సక్సెస్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాట్‌తోనూ చెలరేగిన కింగ్ కోహ్లి (47 బంతుల్లో 59; 5 ఫోర్లు, సిక్స్).. ఫీల్డింగ్ సమయంలో అంపైర్ నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లి (డీఆర్‌ఎస్) రెండు సార్లు సఫలమయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ఆర్సీబీ నిర్ధేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్.. 27 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఇన్నింగ్స్ రెండో బంతికి పంజాబ్ ఓపెనర్ అథర్వ టైడే (4) వికెట్ కోసం (ఎల్బీ) మహ్మద్ సిరాజ్ అప్పీల్ చేశాడు. అయితే అంపైర్ ఆ అప్పీల్‌ను తిరస్కరించడంతో కెప్టెన్ కోహ్లి.. బౌలర్ సిరాజ్, వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ప్రోద్భలంతో రివ్యూకి వెళ్లాడు. రిప్లేలో అథర్వ క్లియర్‌గా వికెట్ల ముందు దొరికనట్లు స్పష్టం కావడంతో అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని అథర్వను ఔట్‌గా ప్రకటించాడు.
ఆతర్వాత ఇలాంటి సీనే ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో మళ్లీ రిపీటైంది. అప్పుడు కూడా బౌలర్ సిరాజే కావడం విశేషం. నాలుగో ఓవర్ రెండో బంతికి లివింగ్‌స్టోన్ ఎల్బీడబ్ల్యూ కోసం సిరాజ్ అప్పీల్ చేశాడు. అప్పుడు కూడా అంపైర్ బౌలర్ అప్పీల్‌ను తిరస్కరించాడు. దీంతో కెప్టెన్ కోహ్లి మరోసారి రివ్యూ వెళ్లాడు. మరోసారి సక్సెస్ సాధించాడు. లివింగ్‌స్టోన్ వికెట్ల ముందు దొరికినట్లు రిప్లేల్లో క్లియర్‌గా తేలడంతో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకుని లివింగ్‌స్టోన్‌ను ఔట్‌గా ప్రకటించాడు.
కోహ్లి బంతుల వ్యవధిలో రివ్యూకి వెళ్లి సక్సెస్ సాధించడంతో అతని అభిమానులు డీఆర్‌ఎస్ (డెసిషన్ రివ్యూ సిస్టమ్)ను కాస్త వీఆర్‌ఎస్ (విరాట్ రివ్యూ సిస్టమ్)గా మార్చి సోషల్‌మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. 175 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ 76 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుండటంతో ఆర్సీబీ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇదంతా కోహ్లి వల్లే జరిగిందని వారు గప్పాలు కొట్టుకుంటున్నారు. కాగా, క్రికెట్ అభిమానులంతా డీఆర్‌ఎస్‌ను ధోని రివ్యూ సిస్టమ్‌గా పిలుచుకునే విషయం అందరికీ తెలిసిందే. రివ్యూల విషయంలో ధోని చాలా కచ్చితంగా ఉంటాడు కాబట్టి ఫ్యాన్స్ అలా పిలుచుకుంటుంటారు.
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. కోహ్లి (59), డుప్లెసిస్ (84) రాణించడంతో నిర్ణీత ఓవరల్లో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు స్కోర్ చేసింది. మ్యాక్స్‌వెల్ (0), దినేశ్ కార్తీక్ (7) నిరాశపరిచారు. పంజాబ్ బౌలరల్లో హర్ప్రీత్ బ్రార్ 2, అర్షదీప్, ఇల్లిస్ తలో వికెట్ పడగొట్టారు. 175 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ 76 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment