#Maldives Row- #ExploreIndianIslands: దేశ పర్యాటక రంగ వృద్ధిలో పాలుపంచుకోవాల్సిన బాధ్యత భారతీయులందరిపై ఉందని టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ అన్నాడు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు వీలుగా చేపడుతున్న చర్యలకు మద్దతుగా ఉండాలని పిలుపునిచ్చాడు.
కాగా ప్రధాని మోదీ ఇటీవల.. కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్‌ను సందర్శించారు. అక్కడి ప్రకృతి అందాలను ఆవిష్కరిస్తూ సముద్ర తీరంలో తన సాహసక్రీడలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేశారు. మీలోని సాహసికుడికి సరైన గమ్యస్థానం లక్షద్వీప్ అంటూ పర్యాటకులను ఉద్దేశించి పోస్ట్ పెట్టారు.
మల్దీవుల మంత్రుల నోటి దురుసుతనం
ఈ నేపథ్యంలో మాల్దీవుల మంత్రి అబ్దుల్లా మాజిద్ మాల్దీవులను మరపించి లక్షద్వీప్‌ను పర్యాటక కేంద్రంగా ప్రోత్సహించడానికే మోదీ ఇలాంటి చర్యకు పూనుకున్నారంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో దుమారం రేగింది. తర్వాత మరియం షియునా, మాల్షా ఆయనకు మద్దతుగా భారత్‌ను తక్కువ చేసే విధంగా మాట్లాడటంతో వివాదం మరింత ముదిరింది.
మాకేం సంబంధం లేదు
దీంతో ఆ దేశ అధ్యక్షుడు మంత్రులను సస్పెండ్ చేసి వారి వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని ప్రకటించారు. అయినప్పటికీ అప్పటికే బాయ్‌కాట్ మాల్దీవ్స్ పేరిట భారత నెటిజన్లు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో జాతికి సంఘీభావంగా పలు పర్యాటక సంస్థలు మాల్దీవుల ప్రయాణ బుకింగ్స్ నిలిపివేశాయి.
ప్రధాని మోదీ ఏం చేస్తున్నారో అర్థం చేసుకోవాలి
ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు ప్రధాని మోదీకి మద్దతుగా భారత పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామంటూ అభిమానులకు పిలుపునిస్తున్నారు. ఈ విషయంపై మహ్మద్ షమీ తాజాగా స్పందించాడు. ఏఎన్‌ఐతో మాట్లాడుతూ.. ‘‘మన దేశ పర్యాటకాన్ని మనమే ప్రమోట్ చేసుకోవాలి. ఏరకంగా అయితేనేమి దేశం అభివృద్ధి చెందడమే ముఖ్యం.
దేశం వృద్ధి సాధిస్తే ప్రతి ఒక్క పౌరుడికి మంచే జరుగుతుంది. ప్రధాని మన దేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని శాయశక్తులా కృషి చేస్తున్నారు. మనమందరం ఆయనకు తప్పక మద్దతుగా ఉండాలి’’ అని షమీ పేర్కొన్నాడు.
ఇంగ్లండ్‌తో సిరీస్ నాటికి
కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో టాప్ వికెట్ టేకర్(24)గా నిలిచిన మహ్మద్ షమీ గాయం కారణంగా సౌతాఫ్రికా పర్యటనకు దూరమయ్యాడు. ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌తో అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే.. భారత మాజీ క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, ఆకాశ్ చోప్రా, సురేశ్ రైనా తదితరులు .. ‘‘భారత పర్యాటకాన్ని ప్రోత్సహించాలి’’ అంటూ ప్రధాని మోదీకి మద్దతుగా పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే.
చదవండి: Ind Vs Afg: అఫ్గన్‌తో టీమిండియా సిరీస్: షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
Comments
Please login to add a commentAdd a comment