ఏదో యథాలాపంగా, ఎంతో యాదృచ్ఛికంగా మొదలైనట్టు కనబడిన మాల్దీవుల పంచాయితీ ఆంతర్యం మన దేశానికి దూరం జరగటమేనని తాజా పరిణామాలు మరింత తేటతెల్లం చేస్తున్నాయి. భారత వ్యతిరేకతే అస్త్రంగా ఎన్నికల్లో ప్రచారం చేసి మొన్న నవంబర్‌లో అధికారంలో కొచ్చిన అధ్యక్షుడు మహమ్మద్ మెయిజూ ఇప్పటికీ అదే పోకడలు పోతున్నారు. లక్షద్వీప్‌లో పర్యటించిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఒక ఛాయాచిత్రాన్ని పోస్టు చేసినప్పుడు ముగ్గురు మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలపై రాజుకున్న రగడ తర్వాత ఆ దేశం ఒకటొకటిగా చర్యలు మొదలుపెట్టింది.
మన దేశం బహుమతిగా ఇచ్చిన రెండు తేలికపాటి అధునాతన ధ్రువ హెలికాప్టర్లు వెనక్కు తీసుకోవాలని కోరటంతో పాటు వచ్చే మార్చి 15లోపు దేశంలోవున్న భారత సైనిక దళాలను ఉపసంహరించాలని తుదిగడువు విధించారు. కేవలం 88 మంది సైనికుల వల్ల తమ దేశానికి ముప్పు ముంచుకొస్తుందంటూ హడావిడి చేస్తున్నారు. అధికారంలోకొచ్చిన వెంటనే భారత పర్యటనకొచ్చే సంప్రదాయాన్ని పక్కనబెట్టి మెయిజూ టర్కీని ఎంచుకున్నారు. ఆ తర్వాత యూఏ ఈలో జరిగే కాప్–28 సదస్సుకెళ్లారు. తాజాగా ఈ నెల 8 నుంచి 12 వరకూ చైనాలో పర్యటించారు. ‘భౌగోళికంగా ఆకారంలో చిన్నదైనంత మాత్రాన మాల్దీవులు ఎవరి బెదిరింపులకూ లొంVýæద’ని హెచ్చరించారు. వీటన్నిటి వెనుకా ఉన్నదెవరో సులభంగానే పోల్చుకోవచ్చు.
మనకూ, మాల్దీవులకూ వున్న బంధం చాలా పాతది. అలాగని భారత్‌పై విద్వేషాన్ని వెళ్లగక్కే శక్తులకు అక్కడ కొదవేమీ లేదు. దేశ ప్రజానీకంలోవున్న భారత్ అనుకూలతను ఎలాగైనా పరిమార్చాలని చాలామంది రాజకీయ నాయకులు ప్రయత్నించారు. ప్రత్యర్థుల విధానాలనూ, వారి కార్యాచరణనూ తప్పుబట్టడానికి సందు దొరకని ప్రతిసారీ భారత్ ప్రసక్తి తీసుకొచ్చి విమర్శించటం అక్కడ పరిపాటి. గతంలో అబ్దుల్లా యామీన్ సైతం మూడు దశాబ్దాల తన ఏలుబడిలో భారత్ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని, చైనాతో అంటకాగి దేశాన్ని నిండా ముంచారు. ప్రశ్నించినవారిని ఖైదు చేశారు. ఇది సరికాదంటూ తీర్పునిచ్చిన ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జీలను జైలుకు పంపారు.
ఆయన నిర్వాకంలో ఆ దేశం చైనా నుంచి భారీగా రుణాలు తీసుకుంది. పెట్టుబడులను ఆహ్వానించింది. వీటివల్ల చెల్లించాల్సిన వడ్డీలే అపరిమితంగా పెరిగిపోయాయి. 2013లో రెండోసారి అధికారంలోకొచ్చాక కూడా యామీన్ తీరు మారలేదు. చివరకు ఆయన విధానాలతో విసిగిన జనం 2018లో ఇబ్రహీం మహ్మద్ సోలిహ్‌ను గద్దెనెక్కించారు. నియంతృత్వ పోకడలకు పోలేదన్న మాటేగానీ... అవినీతిని అంతమొందిస్తానన్న వాగ్దానాన్ని సోలిహ్ నిలుపుకోలేకపోయారు. ఒక అవినీతి కేసులో యామీన్‌కు 11 ఏళ్ల జైలు శిక్ష పడిన మాట వాస్తవమే అయినా, అది మినహా అవినీతి నిర్మూలనకు పకడ్బందీ చర్యలు తీసుకోలేకపోయారు.
ఉపాధి కల్పనలోనూ సొంత మనుషులకే ప్రాధాన్యమిచ్చారన్న ఆరోపణలు వినబడ్డాయి. ఈ అసంతృప్తిని ప్రస్తుత అధ్యక్షుడు మెయిజూ ఆసరాగా తీసుకుని అధికారానికి రాగలిగారు. అయిదున్నర లక్షలమంది జనాభాగల మాల్దీవుల్లో మూడులక్షలమంది సున్నీ ముస్లివ్‌ులు. మతం పేరుతో వీరిలో అత్యధికులను తనవైపు తిప్పుకోవాలని, జాతీయవాదాన్ని రెచ్చగొట్టాలని అంతక్రితం యామీన్ ప్రయత్నించినా ప్రయో జనం లేకపోయింది. కాకపోతే ఈ రాజకీయ క్రీడ చివరకు సెక్యులర్ పార్టీల వైఫల్యంగా మారి మతతత్వ శక్తుల ప్రాబల్యం పెరుగుతుందా అన్న సందేహాలు చాలామందిలో ఉన్నాయి. మెయిజూ అయినా, మరొకరైనా దేశాభివృద్ధిలో భారత్ కీలకపాత్రను తోసిపుచ్చలేరు. ప్రస్తుతం దేశ దిగుమతుల్లో అత్యధిక వాటా భారత్‌దే. దీన్ని తగ్గించుకుందామని ప్రయత్నిస్తే వ్యయం పెరగటం మినహా ప్రయోజనం శూన్యం. ఇక మాల్దీవుల విదేశీ రుణాల్లోనూ సింహభాగం మన దేశానిదే.
గతంలో చైనాతో సాన్నిహిత్యం పెంచుకుని ఎడాపెడా రుణాలు తీసుకుని శ్రీలంక ఆర్థికంగా ఎంత నష్టపోయిందో, ఎలా దివాలా తీసిందో అక్కడి పరిణామాలే తేటతెల్లం చేశాయి.అధికారంలోకొచ్చిన నాటి నుంచీ మెయిజూ పాలనపై దృష్టి నిలపడానికి బదులు చైనాను సంతుష్టిపరచటానికి సమయం వెచ్చిస్తున్నారు. అన్ని దేశాల్లోనూ ఒకే తరహా వ్యవస్థలు,రాజకీయ భావాలుండటం సాధ్యం కాదు. ఎన్నికలప్పుడు ఏం మాట్లాడినా అధికారంలో కొచ్చాక బాధ్యతగా మెలగాలి. దేశ గరిష్ఠ ప్రయోజనాలు గీటురాయిగా ఉండాలి తప్ప, మూర్ఖత్వంతో అవతలివారిని నొప్పించటమే ధ్యేయం కాకూడదు. మెయిజూకు ఎన్నికల జాతరలో తలకెక్కిన మత్తు ఇంకా దిగినట్టు లేదు.
లోగడ పాలించిన యామీన్‌కు చైనాతో ఉన్న సాన్నిహిత్యం, ఇటీవల గద్దె దిగిన సోలిహ్ భారత్ అనుకూల ధోరణి జగద్వితమే అయినా వారిద్దరూ ఇరు దేశాలకూ సమాన దూరంలో మెలుగుతామని ప్రకటించేవారు. విధానాల రూపకల్పనలో, నిర్ణయాల్లో ఎంతోకొంత దాన్ని చేసిచూపేవారు. మెయిజూకు ఆ పరిణతి లేదని ఆయన చర్యలు స్పష్టం చేస్తున్నాయి. అది చాలదన్నట్టు ఇటీవల తైవాన్‌లో చైనాను గట్టిగా వ్యతిరేకించే పక్షమే తిరిగి అధికారంలోకి రాగా, తగుదునమ్మా అంటూ తమది ‘వన్ చైనా’ విధానమేనంటూ ప్రకటించారు. భౌగోళికంగా చూస్తే మాల్దీవులు 1,190 పగడపు దిబ్బల సముదాయం. కానీ అందులో నివాస యోగ్యమైనవి కేవలం 185 దీవులు మాత్రమే. మన దేశానికి 400 కిలోమీటర్ల దూరంలోవుంటూ మన భద్రత రీత్యా హిందూ మహా సముద్రంలో కీలక ప్రాంతంలో ఉన్న మాల్దీవులు భారత్ – చైనాల మధ్య సాగే పందెంలో తలదూర్చి బొప్పి కట్టించుకునే చేష్టలకు దూరంగా ఉండటం అన్నివిధాలా దానికే శ్రేయస్కరం.
India-Maldives Controversy: దారితప్పిన మాల్దీవులు
Published Thu, Jan 18 2024 4:43 AM | Last Updated on Thu, Jan 18 2024 8:29 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment