న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో చేపట్టిన పర్యటన.. దేశీయ పర్యాటకుల్లో ఆ దీవుల సముదాయంపై ఒక్కసారిగా ఆసక్తిని పెంచింది. ఈ నేపథ్యంలో కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.
యుద్ధ విమానాలతోపాటు వాణిజ్య విమాన సర్వీసులను సైతం నడిపేందుకు వీలైన విమానాశ్రయాన్ని లక్షద్వీప్‌లోని మినికాయ్ దీవిలో నిర్మిస్తే బాగుంటుందని యోచిస్తోంది. ఇప్పటి వరకు మినికాయ్ దీవిలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలనే రక్షణ శాఖ ప్రతిపాదన మాత్రమే కేంద్రం వద్ద ఉంది. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో సైనిక, పౌర అవసరాలకు సైతం సరిపోయేలా ఎయిర్‌పోర్టును నిర్మించే సరికొత్త ప్రతిపాదన కేంద్రం పరిశీలిస్తోందని అధికారవర్గాలు తెలిపాయి. అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రాలకు బేస్‌గా, పెరుగుతున్న పైరసీ, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు వ్యూహాత్మకంగా చాలా కీలకమైందిగా ఇక్కడి ఎయిర్‌పోర్టు మారేందుకు అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
అరేబియా సముద్రంపై నిఘాను మరింత విస్తృతం చేసుకునేందుకు మినికాయ్ వద్ద ఎయిర్‌పోర్టు వైమానిక దళానికి ఉపయోగపడనుంది. ప్రస్తుతం లక్షద్వీప్ మొత్తంలో ఒకే ఒక్క విమానాశ్రయం అగట్టిలో ఉంది. ఇక్కడ చిన్న విమానాలు మాత్రమే దిగేందుకు అవకాశం ఉంది. మినికాయ్ దీవిలో విమానాశ్రయం అందుబాటులోకి వస్తే పర్యాటక రంగం అభివృద్ధి చెందనుంది. మరోవైపు, భారత్‌తో వివాదం తమకు భారీగా నష్టం చేసేలా కన్పిస్తున్న నేపథ్యంలో మాల్దీవులకు చెందిన పర్యాటక సంస్థలు రంగంలోకి దిగాయి. ఇటీవల సస్పెన్షన్‌కు గురైన తమ మంత్రులు ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment