పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో ఇవాళ (ఫిబ్రవరి 25) లాహోర్ ఖలందర్స్, పెషావర్ జల్మీ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ఖలందర్స్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన పెషావర్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ సైమ్ అయూబ్ (55 బంతుల్లో 88; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), రోవ్‌మన్ పావెల్ (20 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), బాబర్ ఆజమ్ (36 బంతుల్లో 48; 5 ఫోర్లు), మొహమ్మద్ హరీస్ (5 బంతుల్లో 12 నాటౌట్; ఫోర్, సిక్స్) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో పెషావర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోర్ చేసింది.
పెషావర్ ఇన్నింగ్స్‌లో ఆసిఫ్ అలీ (6) తక్కువ స్కోర్‌కు ఔట్ కాగా.. పాల్ వాల్టర్ 2 పరుగులతో అజేయంగా నిలిచాడు. లాహోర్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది (4-0-33-3) విజృంభించగా.. జహాన్‌దాద్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు.
లీగ్ ప్రస్తుత ఎడిషన్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన లాహోర్ ఇంతవరకు బోణీ కొట్టలేదు. ఈ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. మూడు మ్యాచ్‌లు ఆడిన పెషావర్ ఓ విజయం, రెండు పరాజయాలతో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ముల్తాన్ సుల్తాన్స్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతుంది. క్వెట్టా గ్లాడియేటర్స్, కరాచీ కింగ్స్, ఇస్లామాబాద్ యునైటెడ్ రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment