టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా అరుదైన మైలురాయిని అందుకోనున్నాడు. ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న రెండో టెస్టు పుజారాకు వందోది కానుంది. భారత టెస్టు క్రికెట్‌లో అప్పటికే రెండు దశాబ్దాల పాటు ఎన్నో మ్యాచ్‌ల్లో అడ్డుగోడలా నిలబడి 'ది వాల్(The Wall)' అన్న పేరు లిఖించుకున్న రాహుల్ ద్రవిడ్ కెరీర్ చరమాంకంలో ఉంది. అతను రిటైరైతే టీమిండియాకు మరో వాల్ ఎవరవుతారనేది ఆసక్తికరంగా మారింది. అప్పుడు వచ్చాడు చతేశ్వర్ పుజారా.
కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విలువైన ఇన్నింగ్స్‌లు ఆడి ద్రవిడ్ తర్వాత 'ది వాల్' అన్న బిరుదును సార్థకం చేసుకున్నాడు. అయితే 13 ఏళ్ల కెరీర్‌లో పుజారా చాలా ఎత్తుపల్లాలు చూసినప్పటికి వంద టెస్టుల ఆడిన టీమిండియా ఆటగాళ్ల జాబితాలో చేరడం అభినందించాల్సిన విషయం. టెస్టుల్లో టీమిండియా తరపున వంద టెస్టులు పూర్తి చేసుకున్న 13వ ఆటగాడిగా పుజారా నిలవనున్నాడు. పుజారా వందో టెస్టు ఆడనున్న నేపథ్యంలో అతని తండ్రి అర్వింద్ పుజారా సంతోషం వ్యక్తం చేశాడు.
టెస్టు క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన పుజారా ఇవాళ వందో టెస్టు ఆడనుండడం తనకెంతో గర్వంగా అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో అర్వింద్ పుజారా మాట్లాడాడు. ''పుజారా వందో టెస్టు ఆడుతుండడం నా భార్య రీనా(పుజారా తల్లి) చూడలేకపోతుంది. ఎందుకంటే పుజారా 17 ఏళ్ల వయసులోనే రీనా క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూసింది. ఒకవేళ తను బతికిఉంటే మాత్రం కొడుకు ఘనతను చూసి కచ్చితంగా గర్వపడేది. చిన్నప్పటి నుంచి పుజారాకు కష్టపడే తత్వం అలవాటైంది. స్కూల్ ముగిశాక తన సోదరులతో కలిసి పొలానికి వచ్చి నాకు సాయపడేవాడు.
పుజారా ఎప్పుడు కష్టమైన మార్గాన్ని ఏంచుకున్నప్పటికి చివరకు తాను వెళ్లేది రైట్ చాయిస్‌లోనేనని చాలాసార్లు నిరూపించాడు. పార్టీలకు దూరంగా ఉంటూ ఇప్పటికి మద్యం ముట్టని పుజారా ఈ స్థాయికి రావడానికి ముగ్గురు ముఖ్య కారణమయ్యారు. మొదటి వ్యక్తి నా భార్య రీనా అయితే.. రెండో వ్యక్తి పుజారా మేనత్త(నా చెల్లెలు) పుజా.. ఇక మూడో వ్యక్తి పుజారా గురువు. మంచి క్రికెటర్‌గా పుజారా ఎదగడానికి ఈ ముగ్గురు చాలా కష్టపడ్డారు.
ఇక వాడి(పుజారా) చిన్ననాటి కోచ్‌గా, తండ్రిగా నా పాత్ర కూడా ఉంది. చింటూ(పుజారా ముద్దుపేరు)తో ఎన్ని గంటలు గడిపానో లెక్కలేదు. ప్రైమరీ స్కూల్ సమయంలో రాత్రి డిన్నర్ అయిన తర్వాత నేను, భార్య రీనా, పుజారా కలిసి వాకింగ్‌కు వెళ్లేవాళ్లం. మేం ముందు నడుస్తుంటే వాడు సైకిల్‌పై మా వెనుక ఫాలో అయ్యేవాడు. అక్కడికి దగ్గర్లో ఒక పార్క్ ఉండేది. పార్క్‌లో ఉన్న ఊయలను చూడగానే పుజారా మొహం సంతోషంతో వెలిగిపోవడం నాకు ఇంకా గుర్తుంది.
చిన్నప్పటి నుంచే టెన్నిస్ బాల్‌తో క్రికెట్ ఆడడం నేర్చుకున్న పుజారా బ్యాటింగ్‌తో ఆకట్టుకునేవాడు. వాడిలో మంచి టెక్నిక్ ఉందని గ్రహించిన నేను క్రికెట్ ఫౌండేషన్‌లో చేర్చాను. అలా అండర్-13లో సౌరాష్ట్ర తరపున ఒక మ్యాచ్‌లో 300 పరుగులు కొట్టి తొలిసారి టీమిండియా అండర్-15 ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యాడు. ఆ తర్వాత బెంగళూరులోని ఎన్‌సీఏ క్యాంప్‌కు వెళ్లిపోయాడు. అక్కడి నుంచి పుజారా పరుగుల ప్రవాహం ఎక్కడా ఆగలేదు. అలా అండర్-15, అండర్-19 క్రికెట్‌లో తనదైన ముద్ర చూపించి ఇవాళ టీమిండియా సీనియర్ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక పేజీని రూపొందించుకున్నాడు. పుజారా నా కొడుకుగా పుట్టడం అదృష్టం'' అంటూ అర్వింద్ ఎమోషనల్ అయ్యాడు.
ఇక పుజారా 2010లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. కెరీర్ ఆరంభంలో టెస్టులతో పాటు వన్డేలకు ఎంపికైనప్పటికి.. తర్వాత పూర్తిగా టెస్టులకే పరిమితమయ్యాడు. ఆ తర్వాత టెస్టు స్పెషలిస్ట్‌గా ముద్ర వేయించుకున్న పుజారాతన విలువైన ఇన్నింగ్స్‌లతో టీమిండియాను ఎన్నోసార్లు గెలిపించాడు.. మరెన్నోసార్లు ఓటముల బారి నుంచి రక్షించాడు. మొత్తంగా 99 టెస్టులాడిన పుజారా 7021 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు, 34 అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక ఐదు వన్డేలు మాత్రమే ఆడిన పుజారా 51 పరుగులు చేశాడు. మరి ఫిబ్రవరి 17 నుంచి ఆసీస్‌తో ప్రారంభం కానున్న తన వందో టెస్టులో పుజారా శతకంతో రాణిస్తాడా లేదా అనేది చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment