మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరిగిన బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా గెలవగా, రెండో టెస్టులో టీమిండియా జూలు విదిల్చి విమర్శకుల నోటికి తాళం వేసింది. ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే కూల్చేసిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో 200 పరుగులకే కట్టడి చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు విశేషంగా రాణించడంతో పాటు కెప్టెన్ అజింక్యా రహానే సెంచరీతో కదం తొక్కడంతో విజయానికి దోహద పడింది. కాగా, విదేశీ గడ్డపై తొలుత ఫీల్డింగ్ చేసి ఒక టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించడం టీమిండియాకు 10 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 2010లో శ్రీలంకతో ప్రేమదాస స్టేడియంలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఇలానే విజయం సాధించిన టీమిండియా.. దశాబ్దం తర్వాత ముందుగా ఫీల్డింగ్ చేసి ఒక విదేశీ టెస్టు విజయాన్ని దక్కించుకుంది. ఇక ఆస్ట్రేలియా టాస్ గెలిచిన తర్వాత ఒక స్వదేశీ టెస్టు పరాజయాన్ని చవిచూడటం 9 ఏళ్ల తర్వాత ఇదే మొదటిది. 2011-12 సీజన్‌లో న్యూజిలాండ్‌తో హోబార్ట్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ ఇలానే ఓటమి చూడగా, ఆ తర్వాత ఇంతకాలానికి పరాజయం వెక్కిరించింది. (చదవండి: రహానే ఖాతాలో స్పెషల్ మెడల్.. దాని ప్రత్యేకత ఏమిటి?)
ధోని తర్వాత రహానే..
ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించడం ద్వారా రహానే ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. ఇప్పటివరకూ మూడు టెస్టులకు కెప్టెన్‌గా చేసిన రహానేకు అన్నింటా విజయాలే దక్కాయి. ఫలితంగా ఒక కెప్టెన్‌గా తొలి మూడు టెస్టుల్లో విజయం సాధించిన రెండో టీమిండియా కెప్టెన్‌గా రహానే నిలిచాడు. గతంలో ఎంఎస్ ధోని తన తొలి మూడు టెస్టుల్లో విజయాల్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ధోని సరసన రహానే చేరిపోయాడు. 2016-17 సీజన్‌లో రహానే సారథ్యంలోని టీమిండియా.. ఆసీస్‌పై విజయం సాధించగా, 2018 సీజన్‌లో అఫ్గానిస్తాన్‌పై విజయం సాధించిన జట్టుకు కూడా రహానేనే కెప్టెన్‌గా చేశాడు. తాజాగా ఎంసీజీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రహానే మరో గెలుపును అందుకున్నాడు.
ఎంసీజీలో అత్యధిక విజయాలు
విదేశీ గడ్డపై ఒక వేదికలో టీమిండియా గెలిచిన విజయాల పరంగా ఎంసీజీ తొలి స్థానంలో ఉంది. ఇక్కడ టీమిండియా 14 టెస్టు మ్యాచ్‌లు ఆడి నాలుగు విజయాలు సాధించింది. ఇక పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో క్వీన్స్‌పార్క్(13టెస్టులకు గాను), కింగ్‌స్టన్‌లోని సబీనా పార్క్(13 టెస్టులకు గాను), కొలంబో(ఎస్‌ఎస్‌సీ)లోమూడేసి విజయాలు సాధించింది. (చదవండి: బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఘన విజయం)
Comments
Please login to add a commentAdd a comment