శతక్కొట్టిన టీమిండియా ట్రిపుల్‌ సెంచూరియన్‌ | Ranji Trophy: Karun Nair Knocks On Selectors Doors With 20th First Class Century | Sakshi
Sakshi News home page

శతక్కొట్టిన టీమిండియా ట్రిపుల్‌ సెంచూరియన్‌

Published Fri, Nov 15 2024 6:04 PM | Last Updated on Fri, Nov 15 2024 6:21 PM

Ranji Trophy: Karun Nair Knocks On Selectors Doors With 20th First Class Century

రంజీ ట్రోఫీ 2024-25 విదర్భ ఆటగాడు, టీమిండియా ట్రిపుల్‌ సెంచూరియన్‌ కరుణ్‌ నాయర్‌ సెంచరీతో కదంతొక్కాడు. గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నాయర్‌ 237 బంతుల్లో 16 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 123 పరుగులు చేశాడు. నాయర్‌కు ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో ఇది 20వ సెంచరీ. ఈ మ్యాచ్‌లో నాయర్‌తో పాటు దనిష్‌ మలేవార్‌ (115), అక్షయ్‌ వాద్కర్‌ (104 నాటౌట్‌) కూడా సెంచరీలతో రాణించడంతో విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ దిశగా దూసుకెళ్తుంది. 

మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 512 పరుగులు చేసింది. అక్షయ్‌ వాద్కర్‌తో పాటు ప్రఫుల్‌ హింగే (26) క్రీజ్‌లో ఉన్నారు. గుజరాత్‌ బౌలర్లలో తేజస్‌ పటేల్‌ 3, సిద్దార్థ్‌ దేశాయ్‌ 2, అర్జన్‌ సగ్వస్వల్లా, చింతన్‌ గజా, విశాల్‌ జేస్వాల్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ప్రస్తుతం విదర్భ గుజరాత్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు 169 పరుగుల ఆధిక్యంలో ఉంది.

అంతకుముందు గుజరాత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 343 పరుగులకు ఆలౌటైంది. విశాల్‌ జేస్వాల్‌ (112) సెంచరీతో కదంతొక్కగా.. ప్రియాంక్‌ పంచల్‌ (88), చింతన్‌ గజా (86 నాటౌట్‌) అర్ద సెంచరీలతో రాణించారు. విదర్భ బౌలర్లలో ప్రఫుల్‌ హింగే, ఆదిత్య ఠాకరే, భూటే తలో మూడు వికెట్లు పడగొట్టగా.. హర్ష్‌ దూబే ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

కాగా, తన కెరీర్‌లో మూడో మ్యాచ్‌లోనే ట్రిపుల్‌ సెంచరీ సాధించిన కరుణ్‌ నాయర్‌ను అంతా మరిచిపోయారు. చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో నాయర్‌ ట్రిపుల్‌ సెంచరీ చేసి సంచలన సృష్టించాడు. అయితే ట్రిపుల్‌ సెంచరీ అనంతరం మూడు మ్యాచ్‌ల్లోనే కరుణ్‌ కెరీర్‌ ముగియడం విశేషం. ఆరేళ్లుగా అతనికి జాతీయ జట్టు నుంచి పిలుపు రాలేదు. గత రెండేళ్లలో కరుణ్‌ దేశవాలీ టోర్నీల్లో సత్తా చాటుతున్నా సెలెక్టర్లు అతన్ని పట్టించుకోవడం​ లేదు. ఇటీవల ముగిసిన మహారాజా టీ20 టోర్నీలోనూ కరుణ్‌ సెంచరీ చేశాడు. ప్రస్తుత రంజీ సీజన్‌లో కరుణ్‌కు ఇది తొలి శతకం.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement