
వన్డే సిరీస్ రద్దు.. రషీద్ ఖాన్ కీలక నిర్ణయం
Rashid Khan: తమతో ఆడాల్సిన సిరీస్‌ను బహిష్కరిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయంపై అఫ్గనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఘాటుగా స్పందించాడు. ఆటలో రాజకీయాలకు తావు లేకుండా వ్యవహరించాలంటూ హితవు పలికాడు. తమ దేశానికి ప్రాతినిథ్యం వహించడాన్ని గౌరవంగా భావిస్తానన్న రషీద్.. ప్రపంచానికి తమ ఉనికిని గర్వంగా చాటగల ఏకైక మార్గం క్రికెట్ అని పేర్కొన్నాడు.
కాగా అఫ్గన్‌లో మహిళలు, అమ్మాయిల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లే విధంగా తాలిబన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న నేపథ్యంలో ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ను రద్దు చేసుకుంటున్నట్లు గురువారం ప్రకటించింది. యూఏఈ వేదికగా అఫ్గనిస్తాన్‌తో జరగాల్సిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నుంచి వైదొలుగుతున్నట్లు పేర్కొంది.
ఆటను రాజకీయాలకు దూరంగా ఉంచండి
ఈ విషయంపై స్పందించిన టీ20 కెప్టెన్ రషీద్ ఖాన్.. సీఏ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. అంతేకాదు తాను ఆసీస్ టీ20 టోర్నీ బిగ్‌బాష్ లీగ్ నుంచి తప్పుకొంటాననే సంకేతాలు కూడా ఇచ్చాడు. ఈ మేరకు.. ‘‘మా దేశానికి ఇప్పుడున్న ఏకైక ఆశాకిరణం క్రికెట్!
దయచేసి.. ఆటను రాజకీయాలకు దూరంగా ఉంచండి. మార్చిలో మాతో ఆడాల్సిన సిరీస్ నుంచి తప్పుకొంటున్నట్లు ఆస్ట్రేలియా చేసిన ప్రకటన నన్ను నిరాశకు గురిచేసింది. ప్రపంచ వేదికపై నా దేశానికి ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన గౌరవం. కానీ సీఏ నిర్ణయం మా ప్రయాణాన్ని తిరోగమనం దిశగా ప్రేరేపించేలా చేసింది.
ఒకవేళ ఆస్ట్రేలియాకు.. అఫ్గనిస్తాన్‌తో ఆడటం అసౌకర్యంగా అనిపిస్తే.. నేను బీబీఎల్ ఆడటం ద్వారా ఎవరినీ ఇబ్బంది పెట్టదలచుకోలేదు. ఆ లీగ్‌లో ఆడాలా లేదా అన్న అంశంపై కాస్త కఠినంగానే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’’ అని రషీద్ ఖన్ ట్విటర్‌లో పేర్కొన్నాడు.
కాగా రషీద్ ఖాన్ బిగ్‌బాష్ లీగ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక అఫ్గన్ క్రికెట్ బోర్డు సైతం.. ‘‘ఆస్ట్రేలియా బోర్డు తీసుకున్న నిర్ణయం విషాదకరం. మేమిది ఊహించలేదు. కచ్చితంగా ఇది మాపై తీవ్ర ప్రభావం చూపుతుంది’’ అని తమ ప్రకటనలో పేర్కొంది.
చదవండి: Delhi vs Andhra: సెంచరీతో చెలరేగిన ధ్రువ్ షోరే... ఢిల్లీ దీటైన జవాబు
Cricket! The only hope for the country.
— Rashid Khan (@rashidkhan_19) January 12, 2023
Keep politics out of it. @CricketAus @BBL @ACBofficials ♥️ 🇦🇫 ♥️ pic.twitter.com/ZPpvOBetPJ