దుబాయ్: చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నైను 132 పరుగులకే కట్టడి చేసిన కోహ్లి అండ్ గ్యాంగ్ భళా అనిపించింది. సీఎస్‌కే జట్టులో అంబటి రాయుడు(42; 40 బంతుల్లో 4 ఫోర్లు), జగదీషన్(33;28 బంతుల్లో 4ఫోర్లు)లు మాత్రమే ఆడగా, మిగతా వారు విఫలమయ్యారు. ఆర్సీబీ నిర్దేశించిన 170 పరుగుల టార్గెట్‌లో డుప్లెసిస్(8), వాట్సన్(14)లు నిరాశపరిచారు. వీరిద్దర్నీ వాషింగ్టన్ సుందర్ పెవిలియన్‌కు పంపాడు. అనంతరం రాయుడు-జగదీషన్ జోడి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టింది.
వీరిద్దరూ 65 పరుగులు జత చేసిన తర్వాత జగదీషన్ రనౌట్ అయ్యాడు. అనంతరం ధోని(10) నిరాశపరిచాడు. చహల్ బౌలింగ్ ధోని పెవిలియన్ చేరాడు. ధోని ఔలైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన సామ్ కరాన్ డకౌట్ కావడంతో బ్యాటింగ్ భారం రాయుడిపై పడింది. రాయుడు ఆడినా మరొక ఎండ్ నుంచి సహకారం లభించలేదు. ఉదాన వేసిన 18 ఓవర్ మూడో బంతికి రాయుడు క్లీన్‌బౌల్డ్ కావడంతో సీఎస్‌కే లక్ష్య ఛేదనలో చతికిలబడింది. సీఎస్‌కే నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో మోరిస్ మూడు వికెట్లు సాధించగా, వాషింగ్టన్ సుందర్‌కు రెండు వికెట్లు లభించాయి. ఉదాన,చహల్‌కు చెరో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా తేలిపోయిన సీఎస్‌కే.. ఆర్సీబీ చేతిలో చిత్తుగా ఓడింది. ఇది ఆర్సీబీకి నాల్గో విజయం కాగా, సీఎస్‌కేకు ఐదో ఓటమి.
ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నాలుగు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. దేవదూత్ పడిక్కల్(33; 34 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), విరాట్ కోహ్లి( 90 నాటౌట్; 52 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), శివం దూబే( 22 నాటౌట్; 14 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్)లు రాణించడంతో పోరాడే స్కోరును బోర్డుపై ఉంచారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ ఆదిలోనే అరోన్ ఫించ్(2) వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో దేవదూత్ పడిక్కల్, విరాట్ కోహ్లిలు జట్టు స్కోరును చక్కదిద్దారు. ఈ జోడి 53 పరుగులు జోడించిన తర్వాత పడిక్కల్ ఔటయ్యాడు. అటు తర్వాత ఏబీ డివిలియర్స్ డకౌట్ కాగా, వాషింగ్టన్(10) కూడా నిరాశపరిచాడు. శార్దూల్ ఠాకూర్ తన పదునైన బంతులతో పడిక్కల్, డివిలియర్స్‌లను ఒకే ఓవర్‌లో ఔట్ చేసి మంచి బ్రేక్ ఇచ్చాడు. వాషింగ్టన్ సుందర్.. సామ్ కరాన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. కాగా, కోహ్లి కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో పాటు శివం దూబేలు బ్యాట్ ఝుళిపించడంతో గౌరవప్రదమైన స్కోరు చేసింది. సీఎస్‌కే బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు సాధించగా, సామ్ కరాన్, దీపక్ చాహర్‌లకు తలో వికెట్ లభించింది.
ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను పడిక్కల్, ఫించ్‌లు మెల్లగా ఆరంభించారు. కాగా, చాహర్ మూడో ఓవర్ ఐదో బంతికి ఫించ్ పెవిలియన్ చేరాడు. దాంతో ఆర్సీబీ 13 పరుగుల వద్ద తొలి వికెట్‌ను చేజార్చుకుంది. ఆ సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లి నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కోహ్లి చివరి వరకూ క్రీజ్‌లో ఉండాలనే తపనతో పెద్దగా షాట్లకు వెళ్లకుండా స్టైక్ రొటేట్ చేశాడు. కాగా, ఈ క్రమంలోనే కోహ్లి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 39 బంతుల్లో అర్థ శతకం సాధించాడు. స్లాగ్ ఓవర్లలో కోహ్లి బ్యాట్ ఝుళిపించి స్కోరులో వేగం పెంచాడు. ఓ దశలో ఆర్సీబీ 150 పరుగులు చేరడమే కష్టంగా కనిపించినా కోహ్లి బ్యాటింగ్ మెరుపులతో చివర్లో స్కోరులో వేగం పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment