దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి.. ముందుగా బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. టాస్ అనంతరం కోహ్లి మాట్లాడుతూ.. తొలుత బ్యాటింగ్ చేసి రెండు విజయాలు సాధించామని అందుకు టాస్ గెలిచాక మరొకసారి బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నామన్నాడు. పిచ్‌లు బాగా స్లోగా ఉండటం వల్ల పరుగులు రావడం కష్టంగా ఉందన్నాడు. మంచి జట్లపై మెరుగైన క్రికెట్ ఆడాల్సిన అవసరం ఉందన్నాడు.
ఇక ధోని మాట్లాడుతూ.. ఇది తమకు చాలా ముఖ్యమైన గేమ్ అని అన్నాడు. తాము కొన్ని తప్పిదాలు చేసిన కారణంగానే కొన్ని మ్యాచ్‌లను చేజార్చుకున్నామన్నాడు. ఇప్పటివరకూ సీఎస్‌కే ఆరు మ్యాచ్‌లు ఆడి రెండు విజయాలే సాధించగా, ఆర్సీబీ ఐదు మ్యాచ్‌లకు గాను మూడు విజయాలను అందుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆర్సీబీ ఆడిన గత మ్యాచ్‌లో ఓటమి చవిచూడగా, కేకేఆర్‌తో ఆడిన గత మ్యాచ్‌లో సీఎస్‌కే పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్‌లో కేదార్ జాదవ్‌కు ఉద్వాసన పలికారు. అతని స్థానంలో జగదీషన్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు.
ఈ మ్యాచ్ ద్వారా ఇరుజట్లు మళ్లీ గాడిలో పడాలని భావిస్తున్నాయి. సీఎస్‌కే బ్యాటింగ్‌లో మిడిల్ ఆర్డర్ వైఫల్యం కారణంగా మ్యాచ్‌లను చేజార్చుకుంటుంది. మరొకవైపు సీఎస్‌కే కంటే ఆర్సీబీ అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్‌లోనూ బలంగా ఉంది. కానీ నిలకడలేమి ఆర్సీబీని కలవర పరుస్తోంది. ఓపెనింగ్ జోడి సెట్ అయితే ఆర్సీబీకి ఇబ్బంది ఉండకపోవచ్చు. సీఎస్‌కే పరిస్థితి దారుణంగా ఉంది. మిడిల్ ఆర్డర్‌లో ఆ జట్టు గత ప్రాభవాన్ని కోల్పోయింది. సీఎస్‌కే ఓపెనర్లు వాట్సన్, డుప్లెసిస్‌ల నుంచి మరొకసారి మెరుపులు మెరిపించాల్సి ఉంది. ఒకవేళ ఓపెనర్లు ఆడకపోతే మాత్రం సీఎస్‌కేకు ఇబ్బందులు తప్పవు.
ఇప్పటివరకూ ఇరుజట్ల మధ్య 25 మ్యాచ్‌లు జరగ్గా అందులో సీఎస్‌కే 16 మ్యాచ్‌ల్లో గెలవగా, ఆర్సీబీ 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. సీఎస్‌కే ఎక్కువగా డుప్లెసిస్, వాట్సన్, శార్దూల్ ఠాకూర్‌లపైనే ఆధారపడుతుండగా , ఆర్సీబీలో దేవదూత్ పడిక్కల్, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, చహల్‌లే కీలకం. సీఎస్‌కే జట్టు కెప్టెన్ ధోని గాడిలో పడితే బ్యాటింగ్ సమస్య కొంతవరకూ తీరుతుంది. ఇక ఆర్సీబీలో అరోన్ ఫించ్ ఫామ్‌ను దొరకబుచ్చుకోవాలని చూస్తున్నాడు. ఏది ఏమైనా ధోని వర్సెస్ కోహ్లిల మ్యాచ్ కావడంతో మంచి మజానా ఆస్వాదించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment