స్పైడర్‌మాన్‌ అంటూ రిషభ్‌ పాట.. వైరల్‌ | Rishabh Pant hilariously sings Spiderman Spiderman | Sakshi
Sakshi News home page

స్పైడర్‌మాన్‌ అంటూ రిషభ్‌ పాట.. వైరల్‌

Published Tue, Jan 19 2021 5:15 AM | Last Updated on Tue, Jan 19 2021 8:49 PM

Rishabh Pant hilariously sings Spiderman Spiderman - Sakshi

సోమవారం నాటి ఆటలో ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌తో రిషభ్‌పంత్‌ సాగించిన ‘స్పైడర్‌ మాన్‌’ పాటకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

బ్రిస్బేన్‌: గత సిరీస్‌లో ఆసీస్‌ కెప్టెన్, రిషభ్‌ పంత్‌ మధ్య జరిగిన ‘బేబీ సిట్టర్‌’ సంభాషణపై ఆసక్తికర చర్చ సాగింది. తాజా సిరీస్‌లో గత మూడు టెస్టుల్లోనూ పైన్‌తో పంత్‌ పెద్దగా పెట్టుకున్నట్లు కనిపించలేదు. కానీ చివరి పంచ్‌ అనుకున్నాడేమో సోమవారం పైన్‌ను ఆట పట్టించే ప్రయత్నం చేశాడు. స్మిత్‌ అవుటై కెప్టెన్‌ క్రీజ్‌లోకి వచ్చిన సమయంలో పంత్‌... ‘స్పైడర్‌మాన్, స్పైడర్‌మాన్‌’ అంటూ పాడటం మొదలు పెట్టాడు. అంతటితో ఆగకుండా అదే సినిమా హిందీ డబ్బింగ్‌ పాటను కొనసాగిస్తున్నట్లు నా మనసు నువ్వే దోచుకున్నావంటూ ‘తూనే చురాయా మేరా దిల్‌ కా చైన్‌’ అంటూ పాటను పాడటం భారత బృందంలో నవ్వులు పుట్టించింది.

కాగా, రిషభ్‌ పంత్‌ (138 బంతుల్లో 89 నాటౌట్‌; 9 ఫోర్లు, 1 సిక్స్‌), శుభ్‌మన్‌ గిల్‌ (146 బంతుల్లో 91; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), చతేశ్వర్‌ పుజారా (211 బంతుల్లో 56; 7 ఫోర్లు) రాణించడంతో బ్రిస్బేన్‌ టెస్టులో భారత్‌ 328 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి గెలుపొందింది. దాంతోపాటు 2-1 తో బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫిని వరుసగా రెండోసారి సొంతం చేసుకుంది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా రిషభ్‌ పంత్‌ నిలిచాడు. 21 వికెట్లు ఖాతాలో వేసుకున్న ఆసీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ప్యాట్‌ కమిన్స్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా ఎంపికయ్యాడు. ఇక సోమవారం నాటి ఆటలో ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌తో రిషభ్‌పంత్‌ సాగించిన ‘స్పైడర్‌ మాన్‌’ పాటకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
(చదవండి: ఈరోజుతో నా కల నెరవేరింది : పంత్‌)

రోహిత్‌... స్మిత్‌లా: సిడ్నీ టెస్టులో పంత్‌ బ్యాటింగ్‌ గార్డ్‌ చెరిపేసే ప్రయత్నం స్మిత్‌ చేసినట్లు వార్తలు రావడం, తాను షాడో ప్రాక్టీస్‌ మాత్రమే చేసినట్లు స్మిత్‌ చెప్పడం తెలిసిందే. ఇప్పుడు రోహిత్‌ శర్మ ఇలాగే తన చేతలతో స్మిత్‌ను కాస్త ఉడికించే ప్రయత్నం చేశాడు. స్మిత్‌ క్రీజ్‌లో ఉన్న సమయంలో అతని ఎదురుగా రోహిత్‌ పిచ్‌ పైకి వెళ్లి షాడో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేసి చూపించాడు! నువ్వు చేసింది ఇదేనా అనే అనే భావం అందులో కనిపించింది.
(చదవండి: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌: భారత జట్టు ఇదే!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement