శ్రీలంకతో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్.. శ్రీలంకను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లాదేశ్ 40.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను చేతిక్కించుకుంది.
సెంచరీతో ఆదుకున్న లియనగే..
మిడిలార్డర్ బ్యాటర్ జనిత్ లియనగే అజేయ శతకంతో (102 బంతుల్లో 101 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) కదంతొక్కడంతో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఓ మోస్తరు స్కోర్ చేయగలిగింది. లంక ఇన్నింగ్స్‌లో లియనగే మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు.
అసలంక 37, కుశాల్ మెండిస్ 29, సమరవిక్రమ 14, తీక్షణ 15, హసరంగ 11 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టగా.. ముస్తాఫిజుర్, మెహిది హసన్ మీరజ్ తలో 2, సౌమ్య సర్కార్, రిషద్ హొసేన్ చెరో వికెట్ పడగొట్టారు.
236 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. తంజిద్ హసన్ (84) రిషద్ హొసేన్ (48 నాటౌట్), ముష్ఫికర్ రహీం (37 నాటౌట్) రాణించడంతో మరో 58 బంతులు మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
హసరంగను ఉతికి ఆరేసిన రిషద్ హొసేన్..
ఈ మ్యాచ్‌లో లంక స్పిన్ మాంత్రికుడు వనిందు హసరంగను బంగ్లాదేశ్ టెయిలెండర్ రిషద్ హొసేన్ ఉతికి ఆరేశాడు. హసరంగ బౌలింగ్‌లో 11 బంతులను ఎదుర్కొన్న రిషద్ 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 40 పరుగులు చేశాడు. రిషద్ రెచ్చిపోవడంతో బంగ్లాదేశ్ ఊహించిన దానికంటే త్వరగా మ్యాచ్‌ను ముగించింది.
Comments
Please login to add a commentAdd a comment