England VS India 4th Test 2021: Rohit Sharma and Cheteshwar Pujara Shine India Build 171 Run Lead - Sakshi
Sakshi News home page

Eng Vs Ind 4th Test: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు: ఇప్పటికైతే మొగ్గు మనవైపే!

Published Sun, Sep 5 2021 6:49 AM | Last Updated on Sun, Sep 5 2021 11:40 AM

Rohit Sharma, Cheteshwar Pujara shine as India build 171-run lead - Sakshi

లండన్‌: నాలుగో టెస్టులో తొలిసారి భారత్‌ ఒకరోజు మొత్తం పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (256 బంతుల్లో 127; 14 ఫోర్లు, 1 సిక్స్‌) నిలబడి శతకంతో కదంతొక్కితే... చతేశ్వర్‌ పుజారా (127 బంతుల్లో 61; 9 ఫోర్లు), కేఎల్‌ రాహుల్‌ (101 బంతుల్లో 46; 6 ఫోర్లు; 1 సిక్స్‌) తమ వంతు పాత్ర పోషించారు. వెరసి శనివారం జరిగిన మూడు సెషన్లలో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా... వెలుతురు మందగించి ఆటను నిలిపి వేసే సమయానికి 92 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది. తద్వారా 171 పరుగుల కీలక ఆధిక్యాన్ని కూడగట్టుకుంది. కెపె్టన్‌ విరాట్‌ కోహ్లి (22 బ్యాటింగ్‌; 4 ఫోర్లు), రవీంద్ర జడేజా (9 బ్యాటింగ్‌; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. నాలుగో రోజు కోహ్లి, జడేజా కనీసం ఒక సెషనంతా నిలబడి... ఆ తర్వాత రహానే, రిషభ్‌ పంత్, శార్దుల్‌ ఠాకూర్‌ కూడా రాణిస్తే ఈ టెస్టులో భారత్‌ శాసించే స్థితికి చేరుకుంటుంది.  

రోహిత్‌ అదుర్స్‌...
ఓవర్‌నైట్‌ స్కోరు 43/0తో శనివారం ఆటను కొనసాగించిన భారత ఓపెనర్లు రోహిత్, రాహుల్‌ నిలకడగా ఆడారు. బంతి కూడా పాతబడటంతో మన ఓపెనర్లను ఇంగ్లండ్‌ పేసర్లు పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయారు. అయితే అండర్సన్‌ ఇంగ్లండ్‌కు తొలి బ్రేక్‌ను అందించాడు. అర్ధ సెంచరీ చేసేలా కనిపించిన రాహుల్‌... అండర్సన్‌ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. మొదట అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించినా... రివ్యూకు వెళ్లిన ఇంగ్లండ్‌ వికెట్‌ సాధించుకుంది. ఈ దశలో క్రీజులోకి వచి్చన పుజారాతో కలిసి రోహిత్‌ భారత ఇన్నింగ్స్‌ను నిల బెట్టాడు. ముఖ్యంగా రోహిత్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అలరించాడు. మొయిన్‌ అలీ బౌలింగ్‌లో లాంగాన్‌ మీదుగా సిక్సర్‌ బాదిన రోహిత్‌ 204 బంతుల్లో సెంచరీని పూర్తి చేశాడు.

టెస్టుల్లో విదేశీ గడ్డపై రోహిత్‌కిదే తొలి సెంచరీ కాగా... ఓవరాల్‌గా టెస్టుల్లో అతడికిది ఎనిమిదో శతకం. అంతేకాకుండా ఈ ఇన్నింగ్స్‌ ద్వారా రోహిత్‌ టెస్టుల్లో 3000 పరుగులను పూర్తి చేశాడు. మరో పక్క పుజారా కూడా అర్ధ సెంచరీ సాధించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 153 పరుగులు జోడించారు. అయితే కొత్త బంతిని తీసుకున్న రూట్‌... రాబిన్సన్‌ను బౌలింగ్‌కు పిలిచాడు. కెప్టెన్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్న రాబిన్సన్‌... 81వ ఓవర్‌లో రోహిత్, పుజారాలను అవుట్‌ చేసి ఇంగ్లండ్‌కు డబుల్‌ బ్రేక్‌ ఇచ్చాడు. దాంతో భారత శిబిరంలో కాస్త ఆందోళన కలిగింది. కానీ కోహ్లి, జడేజా సంయమనంతో ఆడుతూ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త పడ్డారు. వెలుతురు మందగించడంతో 13 ఓవర్లు మిగిలి ఉండగానే ఆటను ముగిస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు.

స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 191;
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 290;

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (సి) క్రిస్‌ వోక్స్‌ (బి) రాబిన్సన్‌ 127; కేఎల్‌ రాహుల్‌ (సి) బెయిర్‌స్టో (బి) జేమ్స్‌  అండర్సన్‌ 46; పుజారా (సి) అలీ (బి) రాబిన్సన్‌ 61; విరాట్‌ కోహ్లి (బ్యాటింగ్‌) 22; జడేజా (బ్యాటింగ్‌) 9; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (92 ఓవర్లలో 3 వికెట్లకు) 270.
వికెట్ల పతనం: 1–83, 2–236, 3–237.
బౌలింగ్‌:  జేమ్స్‌ అండర్సన్‌ 23–8–49–1, రాబిన్సన్‌ 21–4–67–2, క్రిస్‌ వోక్స్‌ 19–5–43–0, ఒవర్టన్‌ 10–0–38–0, మొయిన్‌ అలీ 15–0–63–0, జో రూట్‌ 4–1–7–0.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement