'ఇదొక గుణపాఠం.. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ మా కొంపముంచింది' | Rohit Sharma Comments After Lose WTC Final 2021-23 Match | Sakshi
Sakshi News home page

#RohitSharma: 'ఇదొక గుణపాఠం.. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ మా కొంపముంచింది'

Published Sun, Jun 11 2023 6:34 PM | Last Updated on Sun, Jun 11 2023 7:21 PM

Rohit Sharma Comments After Lose WTC Final 2021-23 Match - Sakshi

వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2021-23 టైటిల్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఓవల్‌ వేదికగా ఆసీస్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా 209 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. వరుసగా రెండో ఏడాది డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడిన టీమిండియా రన్నరప్‌కే పరిమితమైంది.  కాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓటమిపై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పందించాడు.

''టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకొని వారిని(ఆస్ట్రేలియాను) కఠిన పరిస్థితుల్లో  బ్యాటింగ్‌కి దించడంతో మేము బాగా ప్రారంభించామని అనుకున్నాను. అందుకు అనుగుణంగా మా బౌలర్లు ఆట తొలిరోజు మొదటి సెషన్‌లో బాగా బౌలింగ్ చేశారు. కానీ తర్వాతి సెషన్‌ నుంచి మా పతనం ఆరంభమైంది. ఆస్ట్రేలియన్ బ్యాటర్లకు క్రెడిట్ ఇవ్వాల్సిందే.

పట్టు చిక్కిందనుకున్న సమయంలో ట్రెవిస్‌ హెడ్‌, స్టీవెన్ స్మిత్‌ల భాగస్వామ్యం వారిని ముందంజలో ఉంచింది. ఒక రకంగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో చేసిన పరుగులతోనే సగం విజయం సాధించింది. కానీ మేము గెలవడానికి ప్రయత్నించాం. రెండో ఇన్నింగ్స్‌లో వారిని తొందరగా ఔట్‌ చేయాలనుకున్నాం. అందులో దాదాపు సక్సెస్‌ అయ్యాం.

కానీ తొలి ఇన్నింగ్స్‌లో లభించిన భారీ ఆధిక్యం వాళ్లకు కలిసొచ్చింది.. అదే మా కొంపముంచింది. మా బ్యాటింగ్‌ విభాగం బాగానే ఉందనుకుంటున్నా. కీలక సమయంలో ఆడడంలో విఫలమయ్యాం. నాలుగేళ్లలో రెండు ఫైనల్స్‌ ఆడామంటే మా ఆట బాగానే ఉందని అర్థం. ఈ ఫైనల్‌ కోసం రెండేళ్లు పాటు కష్టపడ్డాం. వరుసగా టెస్టు సిరీస్‌లు గెలిచి ఫైనల్‌ దాకా వచ్చాం. కానీ దురదృష్టవశాత్తూ ఫైనల్లో ఓడిపోయాం. మ్యాచ్‌ చూడడానికి వచ్చిన అభిమానులు మాకు బాగా మద్దతిచ్చారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు'' అంటూ ముగించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement