విరాట్ కోహ్లితో రోహిత్ శర్మ (ఫైల్ ఫొటో)
Rohit Sharma Captaincy: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఆస్ట్రేలియా మాజీ సారథి మైకేల్ క్లార్క్ మద్దతుగా నిలిచాడు. కేవలం ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఓడినంత మాత్రాన అతడిని తొలగించాలనే డిమాండ్లు సరికావంటూ హిట్‌మ్యాన్‌ను సమర్థించాడు. కాగా డబ్ల్యూటీసీ సైకిల్ 2019-21లో విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు ఫైనల్ చేరుకున్న విషయం తెలిసిందే.
ఇంగ్లండ్‌లో జరిగిన తుదిపోరులో న్యూజిలాండ్ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ పగ్గాలు చేపట్టగా 2021-23 సీజన్‌లోనూ ఫైనల్‌కు అర్హత సాధించింది. కానీ ఈసారి కూడా గతం మాదిరే చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది.
దారుణ ఓటమి
ప్రఖ్యాత ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో రోహిత్ సేన ఏకంగా 209 పరుగుల తేడాతో దారుణంగా ఓడిపోయింది. ఈ క్రమంలో ఆసీస్ సంప్రదాయ క్రికెట్‌లోనూ చాంపియన్‌గా అవతరించి సరికొత్త చరిత్ర సృష్టించగా.. టీమిండియా రిక్తహస్తాలతో తిరిగి వచ్చింది.
ఈ నేపథ్యంలో 36 ఏళ్ల రోహిత్ శర్మ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తాయి. టాస్ విషయంలో, ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు తుదిజట్టులో చోటు కల్పించకపోవడంపై మాజీలు సైతం పెదవి విరిచారు. ఈ క్రమంలో అతడిని సారథ్య బాధ్యతల నుంచి తొలగించాలనే డిమాండ్లు వినిపించాయి.
నాకు నమ్మకం ఉంది
ఈ విషయంపై స్పందించిన మైకేల్ క్లార్క్ రోహిత్‌కు అండగా నిలిచాడు. ‘‘రోహిత్‌పై నాకు పూర్తి నమ్మకం ఉంది. తను గొప్ప కెప్టెన్. అతడి దూకుడైన ఆట తీరు, కెప్టెన్సీ నాకు నచ్చుతాయి.
ఎల్లవేళలా అతడు సానుకూల దృక్పథంతోనే కనిపిస్తాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ రికార్డు అమోఘం. నాయకుడిగా తను విజయవంతమయ్యాడు. ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ గెలవలేదన్న ఒకే ఒక్క కారణంగా రోహిత్ కెప్టెన్‌గా పనికిరాడనడం సరికాదు.
నిజానికి ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో టీమిండియా వరుసగా రెండుసార్లు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకుంది. టెస్టు క్రికెట్‌లో వారి రికార్డు బాగుంది. టీమిండియా నిలకడైన ప్రదర్శనతో ముందుకు సాగుతోంది. ఇక వన్డే వరల్డ్‌కప్ ఈవెంట్‌లో వారు ఎలా ఆడతారో చూడాల్సి ఉంది’’ అని క్లార్క్ చెప్పుకొచ్చాడు. రోహిత్‌ను కెప్టెన్‌గా కొనసాగించాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌కు విజ్ఞప్తి చేశాడు.
చదవండి: 2011 ప్రపంచకప్ ఫైనల్ ఆడాడు.. ధోని సహచర ఆటగాడు! బస్ డ్రైవర్‌గా.. ఒక్కడే కాదు!
‘మొదటి బంతి’కే రూట్ అలా! పంత్‌ను లాగిన ఫ్యాన్స్.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment