టీ20 వరల్డ్‌కప్-2024లో సెయింట్ లూసియా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ తన విశ్వరూపాన్ని చూపించాడు. ఆసీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. స్టేడియం నలుమూలలా హిట్‌మ్యాన్ సిక్స్‌ల వర్షం కురిపించాడు.
రోహిత్‌ను ఆపడం కంగారుల తరం కాలేదు. ఓవరాల్‌గా 41 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 92 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో తుపాన్ ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
రోహిత్ సాధించిన రికార్డులు ఇవే..
అంతర్జాతీయ టీ20ల్లో 200 పరుగుల మైలు రాయిని అందుకున్న తొలి ప్లేయర్‌గా రోహిత్ శర్మ రికార్డులకెక్కాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటివరకు 157 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ 203 సిక్స్‌లు బాదాడు. హిట్‌మ్యాన్ తర్వాత మార్టిన్ గప్టిల్(173), జోస్ బట్లర్(137), గ్లేన్ మ్యాక్స్‌వెల్(133), నికోలస్ పూరన్(132), సూర్యకుమార్ యాదవ్(131) ఉన్నారు.
అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ప్రత్యర్ధిపై అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లలో ఆస్ట్రేలియాపై 132 సిక్స్‌లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉండేది. గేల్ ఇంగ్లండ్‌పై 130 సిక్స్‌లు బాదాడు. తాజా మ్యాచ్‌తో గేల్ రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు.
టీ20 వరల్డ్‌కప్‌లో ఒకే మ్యాచ్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన భారత ప్లేయర్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు. టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ రికార్డును రోహిత్ శర్మ అధిగమించాడు. 2007 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌పై యువీ 7 సిక్స్‌లు బాదాడు. తాజా మ్యాచ్‌లో 8 సిక్స్‌లు కొట్టిన హిట్‌మ్యాన్ యువరాజ్ రికార్డును బ్రేక్ చేశాడు.
టీ20 వరల్డ్‌కప్-2024లో ఫాస్టెస్ట్ ఫిప్టీ నమోదు చేసిన ప్లేయర్‌గా రోహిత్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను రోహిత్ అందుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment