ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్‌తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో తన ఓపెనింగ్ స్థానాన్ని కేఎల్ రాహుల్ కోసం త్యాగం చేసిన హిట్‌మ్యాన్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. కొత్త స్థానంలో రోహిత్ 11 బంతులు ఎదుర్కొని కేవలం 3 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. చార్లీ ఆండర్సన్ బౌలింగ్‌లో ఒలివర్ డేవిస్‌కు క్యాచ్ ఇచ్చి హిట్‌మ్యాన్ పెవిలియన్ బాట పట్టాడు.
వర్షం కారణంగా ఈ రెండు రోజుల వార్మప్ మ్యాచ్ 46 ఓవర్ల మ్యాచ్‌గా కుదించబడింది. వర్షం కారణంగా తొలి రోజు ఆట పూర్తిగా రద్దైంది. రెండో రోజైన ఇవాళ మ్యాచ్ మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రోహిత్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.
హర్షిత్ రాణా (4/44) విజృంభించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్ జట్టు 43.2 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో ఆకాశ్‌దీప్ 2, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు. ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్ ఇన్నింగ్స్‌లో సామ్ కోన్స్టాస్ సెంచరీతో (107) కదంతొక్కాడు. ఆఖర్లో హన్నో జాకబ్స్ (61) అర్ద సెంచరీతో రాణించాడు. జాక్ క్లేటన్ 40 పరుగులతో పర్వాలేదనిపించాడు.
241 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 30 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 59 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 45 పరుగులు చేసి ఔటయ్యాడు. రోహిత్ శర్మ 3 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. యశస్వితో పాటు ఓపెనింగ్ చేసిన కేఎల్ రాహుల్ 44 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 27 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. శుభ్‌మన్ గిల్ (36), నితీశ్‌కుమార్ రెడ్డి (26) క్రీజ్‌లో ఉన్నారు. భారత్.. ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్ చేసిన స్కోర్‌కు ఇంకా 88 పరుగులు వెనుకపడి ఉంది.
ఇదిలా ఉంటే, భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ డిసెంబర్ 6 నుంచి మొదలు కానుంది. ఈ మ్యాచ్‌కు ప్రాక్టీస్‌గానే వార్మప్ మ్యాచ్ నిర్వహించారు. వార్మప్ మ్యాచ్ కూడా రెండో టెస్ట్ తరహాలోనే పింక్ బాల్‌తో డే అండ్ నైట్ ఫార్మాట్‌లో జరుగుతుంది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ 295 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment