టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ శైలిపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత రెండేళ్లలో హిట్‌మ్యాన్ అత్యుత్తమ టెస్టు బ్యాటర్‌గా ఎదిగాడని కొనియాడాడు. లెఫ్టార్మ్ పేసర్ల బౌలింగ్‌లో సమర్థవంతంగా ఆడలేడన్న అపవాదును చెరిపివేసుకున్నాడని ప్రశంసించాడు.
కాగా వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో ఓటమి తర్వాత రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌తో హిట్‌మ్యాన్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఇప్పటి వరకు సఫారీ గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ గెలవలేదన్న అపఖ్యాతిని పోగొట్టడమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్నాడు.
ఈ నేపథ్యంలో సంజయ్ మంజ్రేకర్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘లెఫ్టార్మ్ పేసర్ల బౌలింగ్‌లో రోహిత్ శర్మ బాగా ఆడలేడు అనేది గతం. గత రెండు మూడేళ్లలో అతడు తన బలహీనతలను అధిగమించాడు. మిచెల్ స్టార్క్, షాహిన్ ఆఫ్రిది బౌలింగ్‌లో అద్భుతంగా ఆడాడు.
ప్రస్తుతం తను అత్యుత్తమ టెస్టు ప్లేయర్‌గా కనిపిస్తున్నాడు. గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో అద్భుతంగా ఆడాడు. టెస్టు ఓపెనర్‌గా రాణిస్తూ ఇంగ్లండ్ గడ్డ మీద సెంచరీ చేయడంతో పాటు టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.
గంటల కొద్దీ క్రీజులో నిలబడి ఓపికగా ఆడాడు. ఇక ముందు లెఫ్టార్మ్ పేసర్లను అతడు విజయవంతంగా ఎదుర్కోవడం మనం చూస్తాం’’ అని పేర్కొన్నాడు. సౌతాఫ్రికా పర్యటనలో రోహిత్ శర్మ తప్పక రాణిస్తాడని సంజయ్ మంజ్రేకర్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా డిసెంబరు 26న సౌతాఫ్రికా- భారత్ మధ్య తొలి టెస్టు మొదలుకానుంది.
చదవండి: పెళ్లిళ్లు అక్కడే నిశ్చయమవుతాయంటారు: చహల్ భావోద్వేగం
Comments
Please login to add a commentAdd a comment