కోల్‌కతా: మూడో వన్డేలో ఇంగ్లండ్ చివరి బ్యాటర్ చార్లీ డీన్‌ను భారత బౌలర్ దీప్తి శర్మ రనౌట్ చేసిన తీరు వివాదంపై మ్యాచ్ ముగిసిన తర్వాత తీవ్ర చర్చ జరిగింది. దీప్తి బంతి వేయకముందే డీన్ క్రీజ్ దాటడంతో నిబంధనల ప్రకారం దీప్తి ఆమెను రనౌట్ చేసినా... మరోసారి క్రీడాస్ఫూర్తి అంశం ముందుకు వచ్చింది. దీనిపై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఇప్పటికే వివరణ ఇచ్చినా దీప్తి శర్మ కూడా స్పందించింది. రిటైర్ అయిన పేసర్ జులన్ గోస్వామితో పాటు దీప్తికి స్వదేశం తిరిగొచ్చిన అనంతరం కోల్‌కతా విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ‘రనౌట్ విషయంలో మేం వ్యూహంతో సిద్ధమయ్యాం. మేం ఎన్నిసార్లు హెచ్చరించినా ఆమె మళ్లీ మళ్లీ క్రీజ్ దాటి ముందుకు వెళ్లింది.
ఆ విషయాన్ని అంపైర్లకు కూడా చెప్పాం. అయినా ఆమె తీరు మార్చుకోలేదు. దాంతో నిబంధనల ప్రకారమే అవుట్ చేశాం. మేం ఇంకేం చేయగలం’ అని దీప్తి వివరణ ఇచ్చింది. దీప్తి వ్యాఖ్యలపై ఇంగ్లండ్ కెప్టెన్ హీతర్ నైట్ మళ్లీ స్పందించింది. ‘మ్యాచ్ ముగిసిపోయింది. నిబంధనల ప్రకారమే చార్లీ అవుటైంది. మ్యాచ్‌తోపాటు సిరీస్ గెలిచేందుకు భారత్‌కు అన్ని విధాలా అర్హత ఉంది. అయితే రనౌట్ గురించి మమ్మల్ని హెచ్చరించారనడంలో వాస్తవం లేదు. నిజానికి వారు చేసింది తప్పు కాదు కాబట్టి హెచ్చరించాల్సిన అవసరం లేదు. కానీ తాము చేసిన దానిని సమర్థించుకోవాలని, అందుకు హెచ్చరిక అనే ఒక అబద్ధాన్ని వాడుకోవాలని కూడా భారత్ భావించరాదు’ అని నైట్ వ్యాఖ్యానించింది.
తానియా గదిలో చోరీ...
వన్డే సిరీస్‌లో భారత జట్టు సభ్యురాలిగా ఉన్న తానియా భాటియాకు అనూహ్య పరిణామం ఎదురైంది. లండన్‌లో ఆమె బస చేసిన మారియట్ హోటల్‌లోని తన గదిలో దొంగతనం జరిగినట్లు ఆమె వెల్లడించింది. ‘నన్ను చాలా నిరాశకు గురి చేసిన, నిర్ఘాంతపోయే ఘటన ఇది. ఎవరో అపరిచితులు నా గదిలోకి వచ్చి బ్యాగ్ చోరీ చేశారు. ఇందులో నగదు, కార్డులు, గడియారాలతో పాటు నగలు కూడా ఉన్నాయి. ఇంగ్లండ్ బోర్డుతో భాగస్వామ్యం ఉన్న హోటల్‌లోనే ఇలా జరిగింది. భద్రతా ఏర్పాట్ల వైఫల్యం ఇది. వీలైనంత తొందరగా విచారణ జరిపి తగిన చర్య తీసుకుంటారని భావిస్తున్నా’ అని తానియా ట్వీట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment