
ఫిబ్రవరి 5 నుంచి 27 వరకు జరిగే లీగ్.... హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జెర్సీ ఆవిష్కరణ
Rupay Prime Volleyball League: Hyderabad Black Hawks- సాక్షి, హైదరాబాద్: వచ్చే నెలలో హైదరాబాద్ వేదికగా జరిగే రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో పాల్గొనే హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టు జెర్సీని తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, వీఎం అబ్రహమ్, హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టు యజమాని అభిషేక్ రెడ్డి, బేస్‌లైన్ వెంచర్స్ మేనేజింగ్ డైరెక్టర్ తుహిన్ మిశ్రా, డైరెక్టర్ యశ్వంత్ బియ్యాల తదితరులు పాల్గొన్నారు.
గచ్చిబౌలి స్టేడియంలో ఫిబ్రవరి 5 నుంచి 27 వరకు జరిగే ఈ లీగ్‌కు ఏ23 కంపెనీ సహ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. మొత్తం 24 మ్యాచ్‌లను సోనీ–టెన్ స్పోర్ట్స్ చానెల్స్‌లో ప్రసారం చేస్తారు. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే ఈ లీగ్‌లో మొత్తం ఏడు జట్లు హైదరాబాద్ బ్లాక్ హాక్స్, కాలికట్ హీరోస్, కొచ్చి బ్లూ స్పైకర్స్, అహ్మదాబాద్ డిఫెండర్స్, చెన్నై బ్లిట్జ్, బెంగళూరు టార్పెడోస్, కోల్‌కతా థండర్‌బోల్ట్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి.
చదవండి: టీమిండియాకు భారీ షాక్.. కరోనా బారిన పడిన స్టార్ ఆటగాడు