SPL 2022: ఉత్సాహంగా సాక్షి ప్రీమియర్‌ లీగ్‌ క్రీడా సంబరం | Sakshi Premier League 2022 Andhra Pradesh | Sakshi
Sakshi News home page

SPL 2022: ఉత్సాహంగా సాక్షి ప్రీమియర్‌ లీగ్‌ క్రీడా సంబరం

Published Tue, Apr 19 2022 4:21 PM | Last Updated on Tue, Apr 19 2022 4:32 PM

Sakshi Premier League 2022 Andhra Pradesh

విజయవాడ స్పోర్ట్స్‌: ‘సాక్షి’ మీడియా గ్రూప్‌ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘సాక్షి ప్రీమియర్‌ లీగ్‌ (ఎస్పీఎల్‌) రీజనల్‌ స్థాయి పోటీలు సోమవారం ముగిశాయి. గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్‌ యూనివర్సిటీ ప్రాంగణంలో రెండు రోజులుగా ఈ పోటీలు కొనసాగాయి. జూనియర్స్‌ విభాగంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జట్టు, సీనియర్స్‌ విభాగంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా జట్టు విజేతలుగా నిలిచాయి.

జూనియర్స్‌లో ఉమ్మడి నెల్లూరు జిల్లా జట్టు, సీనియర్స్‌లో ఉమ్మడి గుంటూరు జిల్లా జట్టు ద్వితీయస్థానంలో నిలిచాయి. జూనియర్స్‌ విభాగంలో ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, సీనియర్స్‌ విభాగంలో ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు నెల్లూరు, ప్రకాశం జట్లు హోరాహోరీగా తలపడ్డాయి.  

విజృంభించిన నెల్లూరు 
సీనియర్స్‌ విభాగంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా (నారాయణ ఇంజినీరింగ్‌ కాలేజీ) జట్టు ఆల్‌ రౌండ్‌ ప్రతిభను కనబర్చి రీజనల్‌ ట్రోఫీని కైవసం చేసుకుని సెంట్రల్‌ ఆంధ్రా రీజియన్‌ పోటీలకు ఎంపికైంది. ఉదయం జరిగిన సెమీ ఫైనల్స్‌లో టాస్‌ గెలిచిన ఉమ్మడి ప్రకాశం జిల్లా (ఒంగోలు ట్రిపుల్‌ ఐటీ కాలేజీ) జట్టు ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. బ్యాటింగ్‌ దిగిన నెల్లూరు జట్టు నిర్ణీత పది ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 61 పరుగులు చేసింది.

ఓపెనర్లు ఇద్దరూ విఫలమైనా వన్‌డౌన్‌ బ్యాట్స్‌మెన్‌ సాయిరోహిత్‌ 19 బంతుల్లో 34 (5 ఫోర్లు) పరుగులుచేసి జట్టును ఆదుకున్నాడు. 62 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన ప్రకాశం జట్టు 9.2వ ఓవర్‌ వద్ద 50 పరుగులు చేసి ఆలౌటయింది. నెల్లూరు బౌలర్లు సాయిరోహిత్, తవ్‌సీఫ్‌ మూడేసి వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. దీంతో నెల్లూరు జట్టు 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. 34 పరుగులు చేసి, మూడు వికెట్లు తీసిన ఆల్‌రౌండర్‌ సాయిరోహిత్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌కు ఎంపికయ్యాడు.

సెమీ ఫైనల్స్‌లో సత్తా చాటిన నెల్లూరు జట్టు ఫైనల్స్‌లోనూ ఉమ్మడి గుంటూరు (జేకేసీ డిగ్రీ కాలేజీ) జట్టుపై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి రీజనల్‌ విజేతగా నిలిచింది. టాస్‌ గెలిచిన నెల్లూరు జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకోగా గుంటూరు జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 62 పరుగులు చేసింది. షేక్‌ ఐరోస్‌ 17, వై.శ్రీనివాస్‌ 10 పరుగులు చేశారు. నెల్లూరు బౌలర్లు సాయిరోహిత్‌ మూడు, వెంకటేష్‌ రెండు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నెల్లూరు జట్టు 9.1వ ఓవర్‌లోనే నాలుగు వికెట్లు నష్టపోయి 65 పరుగులు చేసి విజయం సాధించింది. అరుణ్‌ 19, సాయిరోహిత్‌ 15 పరుగులతో రాణించారు. మూడు వికెట్లు తీసి 15 పరుగులు చేసిన సాయిరోహిత్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌కు ఎంపికయ్యాడు.  

పశ్చిమగోదావరి జిల్లా ఆల్‌రౌండ్‌ ప్రతిభ 
జూనియర్స్‌ విభాగంలో జరిగిన ఫైనల్స్‌లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా (సీఆర్‌ రెడ్డి పాలిటెక్నిక్‌ కాలేజీ) జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో సత్తా చాటి ఉమ్మడి నెల్లూరు జిల్లా (వివేకానంద జూనియర్స్‌ కాలేజీ) జట్టుపై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచిన నెల్లూరు జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుని నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి   54 పరుగులు చేసింది. నిఖిల్‌ 12 పరుగులు చేశారు.

పశ్చిమ  గోదావరి జట్టు బౌలర్లు రేవంత్, గణేష్‌ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పశ్చిమగోదావరి జిల్లా జట్టు 8.1 ఓవర్‌కే రెండు వికెట్లు నష్టపోయి 56 పరుగులు చేసి విజయం సాధించింది. బ్యాట్స్‌మన్‌ సంజయ్‌ 22 పరుగులతో రాణించాడు. ఒక వికెట్‌ తీసి, 22 పరుగులుచేసిన పశ్చిమ గోదావరి జిల్లా జట్టు ఆల్‌రౌండర్‌ సంజయ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌కు ఎంపికయ్యాడు. జూనియర్స్‌ విభాగంలో పశ్చిమ గోదావరి జిల్లా జట్టు సెంట్రల్‌ ఆంధ్రా రీజియన్‌ జట్టుకు ఎంపికైంది.  

విజేతలకు ట్రోఫీలు అందజేత
విజేత జట్లకు కేఎల్‌ యూనివర్సిటీ స్టూడెంట్స్‌ అఫైర్స్‌ అడ్వైజర్‌ డాక్టర్‌ హబీబుల్లాఖాన్, డీన్‌ డాక్టర్‌ సీహెచ్‌ హనుమంతరావు ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ‘సాక్షి’ యాజమాన్యం ఈ టోర్నీ నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడాకారుల్లోని క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఈ టోర్నీ దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ‘సాక్షి’ విజయవాడ బ్రాంచ్‌ మేనేజర్‌ కె.ఎస్‌.అప్పన్న తదితరులు పాల్గొన్నారు.   

నేటి నుంచి రాష్ట్ర స్థాయి పోటీలు
‘సాక్షి’ ప్రీమియర్‌ లీగ్‌ (ఎస్పీఎల్‌) రాష్ట్ర స్థాయి జూనియర్స్, సీనియర్స్‌ పురుషుల క్రికెల్‌ పోటీలు కేఎల్‌ యూనివర్సిటీ క్రీడా మైదానంలో మంగళవారం ప్రారంభమవుతాయి. ఈ పోటీల్లో ఉత్తరాంధ్ర, సెంట్రల్‌ ఆంధ్రా, రాయలసీమ రీజియన్‌ జట్లు లీగ్‌ పద్ధతిలో తలపడతాయి. జూనియర్స్‌ విభాగంలో పశ్చిమగోదావరి జిల్లా జట్టు, సీనియర్స్‌ విభాగంలో నెల్లూరు జిల్లా జట్టు సెంట్రల్‌       ఆంధ్రా రీజియన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఉత్తరాంధ్ర రీజియన్‌కు విజయనగరం జిల్లా (జూనియర్స్‌), విశాఖపట్నం జిల్లా (సీనియర్స్‌), రాయలసీమ రీజియన్‌కు చిత్తూరు జిల్లా (సీనియర్స్‌), అనంతపురం జిల్లా (జూనియర్స్‌) జట్లు ప్రాతినిధ్యం వహిస్తాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement