కరాచీ/న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్‌ల 14 ఏళ్ల వివాహ బంధానికి విడాకుల కార్డు పడింది. ఇది జరిగి చాన్నాళ్లే అయినా... సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతున్నా... ఇరు వర్గాల నుంచి అధికారికంగా ‘అవును... కాదు’ అనే మాట రాలేదు! ఎలాంటి స్పష్టత లేదు. కానీ షోయబ్ ముచ్చటగా మూడోసారి ఓ ఇంటివాడు కావడంతోనే ఇద్దరి వైవాహిక బంధం ముక్కలైనట్లు అధికారికంగా... ఆలస్యంగా తెలిసింది.
పాకిస్తాన్ నటి సనా జావేద్‌ను పెళ్లి చేసుకున్న షోయబ్ తన ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో ఫొటోల్ని పంచుకున్నాడు. 41 ఏళ్ల ఈ పాక్ క్రికెటర్‌కు ఇది మూడో పెళ్లి. హైదరాబాదీ అమ్మాయి అయేషా సిద్ధిఖికు తలాక్ ఇచ్చాకే సానియా మీర్జాను 2010 ఏప్రిల్ 12న హైదరాబాద్ వేదికగా షోయబ్ మాలిక్ రెండో వివాహం చేసుకున్నాడు. నటి సనా జావేద్‌కేమో ఇది రెండో పెళ్లి. ఆమె 2020లో పాకిస్తాన్ సినీ గాయకుడు, రచయిత ఉమైర్ జైస్వాల్‌ను వివాహమాడింది.
అయితే వీరిద్దరి బంధం 2023లో ముగిసింది. తాజాగా సోషల్ మీడియా ‘ఎక్స్’లో షోయబ్ మాలిక్–సనా జావేద్‌ల పెళ్లి ఫోటోలు వైరల్ కావడంతోనే బయటి ప్రపంచానికి సానియా–షోయబ్‌ల పెళ్లి పెటాకులైనట్లు తెలిసింది. అంతవరకు గుసగుసలే వినిపించేవి! ఇక ఈ విషయాన్ని టెన్నిస్ స్టార్ కుటుంబ వర్గాలు ధ్రువీకరించక తప్పలేదు. ‘అవును... వాళ్లిద్దరు విడిపోయారు.
ఇది ‘తలాక్’ కాదు... ‘ఖులా’ ప్రకారం వారి బంధం రద్దయింది. ఇంతకుమించి చెప్పడానికి మా దగ్గరేమీ లేదు’ అని కుటుంబ వర్గాలు తెలిపాయి. గత ఏడాది అక్టోబర్‌లో తనయుడు ఇజ్‌హన్ ఐదో పుట్టిన రోజు వేడుకలకు షోయబ్ హాజరయ్యాడు. అయితే ఈ వేడుకల ఫొటోలను షోయబ్, సానియా వేర్వేరుగా తమ సోషల్ మీడియా అకౌంట్లలో పంచుకున్నారు.
అప్పుడు నిశ్చి తార్థం... ఇప్పుడు వివాహం!
37 ఏళ్ల సానియాకు తన ప్రొఫెషనల్ కెరీర్‌లో ఒడిదొడుకులు ఎదురైనట్లే వ్యక్తిగత జీవితంలోనూ ఎదురయ్యాయి. ముందుగా కుటుంబ మిత్రులైన సొహ్రాబ్‌తో సానియాకు నిశ్చి తార్థం కూడా ఘనంగానే జరిగింది. కానీ కొన్ని నెలల వ్యవధిలోనే పెళ్లిదాకా రాకుండానే ఆ బంధం ముగిసింది. అనంతరం పాకిస్తానీ మాజీ కెపె్టన్ షోయబ్ మాలిక్‌ను వివాహమాడింది. వీరికి ఐదేళ్ల కుమారుడు ఇజ్‌హాన్ ఉన్నాడు.
ప్రస్తుతం తల్లి సానియా దగ్గరే ఇజ్‌హాన్ పెరుగుతున్నాడు. తన 20 ఏళ్ల అంతర్జాతీయ టెన్నిస్ కెరీర్‌లో సానియా మొత్తం 43 డబుల్స్ టైటిళ్లు సాధించింది. ఇందులో మూడు మహిళల డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్, మూడు మిక్స్‌డ్ డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి.
ఇది తలాక్ కాదు... ఖులా!
సరిగ్గా 14 ఏళ్ల క్రితం 2010 ఏప్రిల్ 12న టెన్నిస్ స్టార్ సానియా, పాకిస్తాన్ క్రికెట్ స్టార్ షోయబ్ మాలిక్ వివాహం అంగరంగ వైభవంగా హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‌లో జరిగింది. ఈ బంధం 12 ఏళ్ల పాటు 2022 వరకు సజావుగానే సాగింది. ఇరువురు తమ కెరీర్‌ను కొనసాగిస్తూనే దుబాయ్‌లో కాపురం పెట్టారు. అన్యోన్యంగా సాగిన వీరి కాపురం రెండేళ్ల క్రితం బీటలు వారింది. కెరీర్‌కు రిటైర్మెంట్ పలికి వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయిస్తున్న సమయంలో పొరపొచ్చలు రావడంతో సానియా మీర్జా నుంచే విడాకుల ప్రతిపాదన వచ్చింది.
ఇస్లాం చట్ట ప్రకారం దీన్ని ‘ఖులా’ అంటారు. వివాహ బంధం నుంచి భార్య ఏకపక్షంగా విడిపోవాలనుకుంటే ‘ఖులా’తో రద్దు చేసుకోవచ్చు. దీనికి భర్త నుంచి భరణం, ఇతరత్రా లాంఛనాలు పూర్తి చేయాల్సిన అవసరం ఉండదు. తలాక్ అనేది భర్త రద్దు చేసుకునే విడాకుల ప్రక్రియ. కొంతకాలంగా ఇద్దరు ఎడమొహం పెడమొహంగా ఉండటంతో 2022లోనే వివాహరద్దు తంతు వివాదాస్పదం కాకుండా జరిగిపోయిందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment