2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్‌ల కోసం జులై 12- ఆగస్ట్ 13 వరకు టీమిండియా వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఈ పర్యటన నిమిత్తం భారత జట్టును అధికారికంగా ప్రకటించనప్పటికీ.. పలువురు ఆటగాళ్లు జట్టులోకి రావడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. వన్డే వరల్డ్‌కప్‌కు ముందు పలువురు సీనియర్లకు రెస్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్న బీసీసీఐ.. విండీస్ పర్యటన కోసం యువ ఆటగాళ్లను ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సెలెక్టర్ల దృష్టిలో పలువురు సీనియర్ ఆటగాళ్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఇదే సమయంలో ఒకరిద్దరు సీనియర్లపై వేటుకు కూడా అవకాశం లేకపోలేదు. అలాగే విండీస్ పర్యటన మొత్తానికి హార్ధిక్ పాండ్యా నాయకత్వం చేయడం దాదాపుగా ఖాయమైపోయిందనే ప్రచారం జరుగుతుంది.
సంజూ శాంసన్ రీఎంట్రీ..!
విండీస్ పర్యటనలో జరిగే వన్డే, టీ20 సిరీస్‌ల కోసం టీమిండియా సీనియర్ వికెట్‌కీపర్ సంజూ శాంసన్ ఎంపిక దాదాపుగా ఖరారైపోయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. టీమిండియా తరఫున ఈ ఏడాది జనవరిలో చివరిసారిగా ఆడిన శాంసన్.. ఆ తర్వాత జరిగిన ఐపీఎల్ 2023 సీజన్‌లో మెరుగ్గా రాణించడంతో సెలెక్టర్లు అతనికి ఈ అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఆల్ ఫార్మాట్ కెప్టెన్‌గా హార్ధిక్..
విండీస్ పర్యటనలో హార్ధిక్ పాండ్యా అన్ని ఫార్మాట్లలో టీమిండియాకు సారధ్యం వహించే అవకాశం ఉంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ పర్యటన నుంచి తప్పుకోవడం దాదాపుగా ఖరారైన నేపథ్యంలో టెస్ట్ పగ్గాలు సైతం హార్ధిక్‌కే అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే హార్ధిక్ చాలాకాలం తర్వాత టెస్ట్‌ల్లోకి ఎంట్రీ ఇస్తాడు.
ఉమేశ్, పుజారాలపై వేటు..
గత కొంతకాలంగా టెస్ట్‌ల్లో దారుణంగా విఫలమవుతున్న చతేశ్వర్ పుజారా, ఉమేశ్ యాదవ్‌లపై వేటుకు సర్వం సిద్ధమైనట్లు సమాచారం. విండీస్ పర్యటనకు వీరి పేర్లను పరిశీలించే అవకాశం కూడా లేదని తెలుస్తోంది. వీరి స్థానంలో యశస్వి జైస్వాల్, ముకేశ్ కుమార్‌లను ఎంపిక చేసే అవకాశం ఉంది.
యువ ఆటగాళ్ల ఎంట్రీ..
విండీస్ పర్యటన కోసం ఐపీఎల్ 2023 ప్రదర్శనల ఆధారంగా పలు ఎంపికలు ఉండవచ్చని సమాచారం. టీ20 జట్టులో రింకూ సింగ్, యశస్వి జైస్వాల్, జితేశ్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, మోహిత్ శర్మలకు దాదాపుగా ఛాన్స్ దక్కవచ్చని తెలుస్తోంది.
విండీస్ పర్యటన వివరాలు..
తొలి టెస్ట్- జులై 12-16, డొమినికా
రెండో టెస్ట్- జులై 20-24, పోర్ట్ ఆఫ్ స్పెయిన్
జులై 27- తొలి వన్డే, బ్రిడ్జ్‌టౌన్
జులై 29- రెండో వన్డే, బ్రిడ్జ్‌టౌన్
ఆగస్ట్ 1- మూడో వన్డే, పోర్ట్ ఆఫ్ స్పెయిన్
ఆగస్ట్ 4- తొలి టీ20, పోర్ట్ ఆఫ్ స్పెయిన్
ఆగస్ట్ 6- రెండో టీ20, గయానా
ఆగస్ట్ 8- మూడో టీ20, గయానా
ఆగస్ట్ 12- నాలుగో టీ20, ఫ్లోరిడా
ఆగస్ట్ 13- ఐదో టీ20, ఫ్లోరిడా
Comments
Please login to add a commentAdd a comment