
మెల్‌బోర్న్: కొత్త కాస్ట్యూమ్‌తో బరిలోకి దిగిన అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో పదో ర్యాంకర్ సెరెనా 6–1, 6–1తో లౌరా సిగెమండ్ (జర్మనీ)పై గెలిచి రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లింది. 56 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సెరెనా నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది.
ఫ్లోరెన్స్ స్ఫూర్తితో...
కెరీర్‌లో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి పెట్టిన 39 ఏళ్ల సెరెనా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కొత్త కాస్ట్యూమ్‌తో తళుక్కుమంది. ‘వన్ లెగ్ క్యాట్‌సూట్’ను ధరించి ఆడిన సెరెనా అమెరికా మహిళా దిగ్గజ అథ్లెట్, ఒలింపిక్ మాజీ చాంపియన్ ఫ్లోరెన్స్ గ్రిఫిత్ జాయ్‌నర్ స్మారకార్థం దీనిని ధరించినట్లు తెలిపింది. ‘ఫ్లో జో’గా పేరున్న ఫ్లోరెన్స్ 1988లో మహిళల 100, 200 మీటర్ల విభాగాల్లో ప్రపంచ రికార్డులు నెలకొల్పింది.
కెర్బర్ పరాజయం
సెరెనాతోపాటు ఆమె అక్క వీనస్ విలియమ్స్, రెండో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా), మూడో సీడ్ నయోమి ఒసాకా (జపాన్), తొమ్మిదో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) కూడా రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఒసాకా 6–1, 6–2తో పావ్లీచెంకోవా (రష్యా)పై, హలెప్ 6–2, 6–1తో లిజెట్టి కాబ్రెరా (ఆస్ట్రేలియా)పై, వీనస్ 7–5, 6–2తో ఫ్లిప్‌కెన్స్ (బెల్జియం)పై, క్విటోవా 6–3, 6–4తో మినెన్ (బెల్జియం)పై గెలుపొందారు. అయితే 2016 చాంపియన్, 25వ ర్యాంకర్ కెర్బర్ (జర్మనీ) 0–6, 4–6తో 63వ ర్యాంకర్ బెర్నార్డా పెరా (అమెరికా) చేతిలో ఓడింది. ఏడో సీడ్ సబలెంకా (బెలారస్), ఎనిమిదో సీడ్ బియాంక ఆండ్రెస్కూ (కెనడా) కూడా రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టారు.
జొకోవిచ్ శుభారంభం...
పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, వరల్డ్ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా) రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. తొలి రౌండ్‌లో జొకోవిచ్ 6–3, 6–1, 6–2తో జెరెమి చార్డీ (ఫ్రాన్స్)ను ఓడించాడు. మూడో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 7–6 (8/6), 6–2, 6–3తో కుకుష్‌కిన్ (కజకిస్తాన్)పై, ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–7 (8/10), 7–6 (7/5), 6–3, 6–2తో గిరోన్ (అమెరికా)పై గెలిచి ముందంజ వేశారు. అయితే పదో సీడ్ గేల్ మోన్‌ఫిల్స్ (ఫ్రాన్స్) 6–3, 4–6, 5–7, 6–3, 3–6తో ఎమిల్ రుసువోరి (ఫిన్‌లాండ్) చేతిలో ఓడిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment