ముంబై: ఒమన్ పర్యటనకు వెళ్లే ముందు తన ఆరాధ్య క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌తో ముచ్చటించడం తనకు మరపురాని అనుభూతిని కలిగించిందని ముంబై యువ బ్యాట్స్‌మన్ యశస్వి జైశ్వాల్ పేర్కొన్నాడు. సచిన్ అంతటి ఆటగాడు తనకు సలహాలివ్వడం అద్భుతంగా అనిపించిందని, వాటి వల్ల నా ఆటతీరు చాలా మెరుగుపడిందని తెలిపాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో ముచ్చటించడంపై యశస్వి స్పందిస్తూ.. ఒమన్ పర్యటనకు వెళ్లే ముందు ముంబై క్రికెట్ అసోసియేషన్ సచిన్‌తో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిందని తెలిసి ఎగిరి గంతులేశానని, ఈ సందర్భంగా సచిన్‌తో మాట్లాడే అవకాశం రావడం తన అదృష్టమని పేర్కొన్నాడు.
ఈ సందర్భంగా యశస్వి ఐపీఎల్ మలిదశ మ్యాచ్‌లపై కూడా స్పందించాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించే యశస్వి.. ఒమన్ పర్యటన తనకు ఉపయోగపడుతుందని తెలిపాడు. ఒమన్‌లోని వాతావరణం యూఏఈలో లాగే ఉంటుందని, పిచ్‌లు దాదాపు ఒకే విధంగా ఉంటాయని, ఈ అంశాలు తాను రాణించేందుకు తోడ్పడతాయని విశ్వాసం వ్యక్తం చేశాడు. అలాగే రాజస్థాన్ ప్లే ఆఫ్ దశకు చేరుతుందని, టీమిండియాకు ఆడడమే తన తదుపరి లక్ష్యమని యశస్వి చెప్పుకొచ్చాడు. కాగా, ఐపీఎల్ 13వ సీజన్‌లో యశస్వి తొలిసారిగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు. ఆ సీజన్‌లో ఆర్‌ఆర్ జట్టు అతన్ని రూ. 20లక్షల కనీస ధరకు చేజిక్కించుకుంది. ఇప్పటివరకు ఐపీఎల్‌లో 3 మ్యాచ్‌లు ఆడిని యశస్వి.. 66 పరుగులు చేశాడు.
ఇదిలా ఉంటే, త్వరలో జరుగనున్న టీ20 ప్రపంచకప్ 2021 క్వాలిఫయర్స్ నేపథ్యంలో సన్నాహక మ్యాచ్‌ల కోసం ముంబై క్రికెట్ జట్టుని ఒమన్ తమ దేశానికి ఆహ్వానించింది. ఈ పర్యటనలో ఒమన్.. ముంబైతో మూడు టీ20లు, నాలుగు వన్డేలు ఆడింది. ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌లో యశస్వి జైశ్వాల్ అద్భుతంగా రాణించాడు. పలు కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు.
చదవండి: ఇకపై అక్కడ మహిళల 'ఆటలు' సాగవు..
Comments
Please login to add a commentAdd a comment