‘ప్రతీ షాట్ అంతకంటే ముందు ఆడిన షాట్‌కంటే అందంగా కనిపించింది’... శుబ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ గురించి ఏకవాక్య ప్రశంస ఇది. అందమే కాదు అద్భుతం అనిపించే షాట్లు కూడా అతను ఆడాడు. లేదంటే 182 పరుగుల స్కోరు నుంచి వరుసగా మూడు సిక్సర్లతో ‘డబుల్ సెంచరీ’కి చేరాలంటే ఎంత సాహసం ఉండాలి. బుధవారం హైదరాబాద్‌లో గిల్ దానిని చేసి చూపించాడు. శ్రీలంకతో సిరీస్ తొలి వన్డేలో గిల్ ఓపెనింగ్ చేస్తాడని... అంతకుముందు మ్యాచ్‌లో ‘డబుల్ సెంచరీ’ చేసిన ఇషాన్ కిషన్‌కు చోటు లేదని రోహిత్ చెప్పడంతో ఎన్నో విమర్శలు వచ్చాయి.
ఇప్పుడు శుబ్‌మన్ వాటన్నింటినీ పటాపంచలు చేశాడు. తన ఆటలో ఉండే వాడి ఏమిటో కూడా ప్రదర్శించి వన్డేల్లో తాను ఎందుకు సరైనవాడినో నిరూపించుకున్నాడు. గత మ్యాచ్‌లో సెంచరీ సాధించిన అతను ఈసారి డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. ఫెర్గూసన్ వేసిన రెండో ఓవర్లో అతను కవర్స్ దిశగా కొట్టిన మొదటి ఫోర్ నిజంగా సూపర్. అలా మొదలైన పరుగుల లెక్క ఆపై జోరు అందుకొని ప్రవాహంలా మారింది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో అతని పుల్ షాట్‌లు, ఎక్స్‌ట్రా కవర్ మీదుగా డ్రైవ్‌లు, బ్యాక్ ఫుట్ పంచ్‌లు అత్యుత్తమ రీతిలో సాగాయి.
బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో స్లాగ్ స్వీప్ సిక్స్‌తో 52 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయింది. కివీస్ బౌలర్లలో ఎవరినీ వదలకుండా అతను చితక్కొట్టాడు. 87 బంతుల్లో అతని సెంచరీ పూర్తయినప్పుడు ఆనందం కనిపించింది కానీ... మున్ముందు మరింత విధ్వంసం సృష్టించబోతున్నట్లు తనూ ఊహించి ఉండడు. ఒకవైపు సహచరులు వెనుదిరుగుతున్నా, తను మాత్రం పట్టుదలగా నిలబడి స్వేచ్ఛగా పరుగులు సాధిస్తూ పోయాడు. 150 పరుగుల మైలురాయి కూడా సిక్సర్‌తోనే పూర్తయింది.
చివరి ఓవర్లలో కివీస్ బౌలింగ్ అనూహ్యంగా మెరుగైంది. పరుగులు రావడం కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో టక్నర్ వేసిన ఇన్నింగ్స్ 48వ ఓవర్... రెండు సిక్స్‌లతో గిల్ చెలరేగిపోయాడు. ఫెర్గూసన్ వేసిన 49వ ఓవర్... తొలి మూడు బంతుల్లో ఫైన్ లెగ్, లాంగాఫ్, లాంగాఫ్...వరుసగా మూడు సిక్సర్లు... 145 బంతుల్లో డబుల్ సెంచరీ... అరుదైన మైలురాయిని దాటిన గిల్ గర్జిస్తూ విజయనాదం చేశాడు.
58 బంతుల్లోనే తర్వాతి వంద అతని ఖాతాలో చేరింది. తర్వాతి ఓవర్లోనూ మరో సిక్స్ కొట్టిన అనంతరం ఫిలిప్స్ క్యాచ్‌తో ఒక గొప్ప ఇన్నింగ్స్‌కు ముగింపు లభించింది. మైదానంలో 31,755 మంది ప్రేక్షకులు హర్షధ్వానాలతో హోరెత్తిస్తుండగా ఈ పంజాబీ స్టార్ మైదానం వీడాడు. జట్టులో తర్వాతి స్కోరు 34 మాత్రమే అంటే గిల్ జోరు ఎలా సాగిందో అర్థమవుతుంది.
పంజాబ్‌లో జిల్లా స్థాయి అండర్–16 పోటీల్లోనే 351 పరుగులు బాది అందరినీ ఆశ్చర్యపర్చిన గిల్, విజయ్ మర్చంట్ ట్రోఫీలో డబుల్ సెంచరీతో వెలుగులోకి రాగా... వరుసగా రెండేళ్లు బీసీసీఐ బెస్ట్ జూనియర్ క్రికెటర్ అవార్డు అందుకోవడంతో అందరి దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్ మార్గనిర్దేశనంలో అండర్ –19 స్థాయిలో భారీ స్కోర్లు సాధిస్తూ 2018లో అండర్–19 వరల్డ్‌కప్ విజయంలో కీలకపాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాక గిల్‌కు ఎదురు లేకుండా పోయింది.
టెస్టుల్లో ఇప్పటికే తన స్థానం సుస్థిరం చేసుకున్న గిల్‌కు సీనియర్ల గైర్హాజరులో వన్డేల్లో ఇటీవల అవకాశాలు వచ్చాయి. వాటిని సమర్థంగా అందిపుచ్చుకొని ఇప్పుడు తనను తప్పించే అవకాశంలేని స్థితికి వచ్చాడు. 23 ఏళ్లకే పలు ఘనతలు సాధించి గిల్ మున్ముందు మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయం.
–సాక్షి క్రీడా ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment