సికందర్ రజా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో (4-0-28-3, 42 బంతుల్లో 65; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో స్వదేశంలో ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో జింబాబ్వే వికెట్ తేడాతో గెలుపొందింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ సమరంలో 11వ నంబర్ ఆటగాడు ముజరబానీ ఆఖరి బంతికి 2 పరుగులు తీసి జింబాబ్వేను గెలిపించాడు.
చివరి ఓవర్లలో ఐర్లాండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌ను జింబాబ్వే ఆటగాళ్లు ఆఖరి బంతి వరకు తీసుకెళ్లారు. 18 బంతుల్లో 18 పరుగులు చేయాల్సిన దశలో జింబాబ్వే ఆటగాళ్లు తడబడ్డారు. 18వ ఓవర్‌లో వికెట్ నష్టపోయి 5 పరుగులు, 19వ ఓవర్‌లో 2 వికెట్లు కోల్పోయి 4 పరుగులు, ఆఖరి ఓవర్‌లో వికెట్ కోల్పోయి 9 పరుగులు చేసి అతి కష్టం మీద విజయతీరాలకు చేరారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. సికందర్ రజా, నగరవ (4-0-23-2), ముజరబానీ (4-0-24-2), సీన్ విలియమ్స్ (3-0-18-1) ధాటికి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఐరిష్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ బల్బిర్నీ (32) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. సికందర్ రజా రాణించడంతో సునాయాసంగా విజయం సాధించేలా కనిపించింది. అయితే ఇన్నింగ్స్ ఆఖర్లో ఐర్లాండ్ బౌలర్లు అనూహ్యంగా పుంజుకుని జింబాబ్వేకు గెలుపును అంత ఈజీగా దక్కనీయలేదు. అతి కష్టం మీద జింబాబ్వే చివరి బంతికి విజయం సాధించింది.
ఐరిష్ బౌలర్లలో మార్క్ అదైర్, జాషువ లిటిల్, బ్యారీ మెక్‌కార్తీ, క్రెయిగ్ యంగ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. జార్జ్ డాక్రెల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన సికందర్ రజాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. రజాకు ఈ ఏడాది టీ20ల్లో ఇది ఎనిమిదో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కావడం విశేషం. కాగా, 3 టీ20లు, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఐర్లాండ్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment