టీ20 వరల్డ్‌కప్ గ్రూప్-బి క్వాలిఫయర్స్‌లో ఇవాళ (అక్టోబర్ 17) జరిగిన రెండో మ్యాచ్‌లో జింబాబ్వే ఐర్లాండ్‌ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. సికందర్ రజా (48 బంతుల్లో 82; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేయగా, ఛేదనలో తడబడిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా జింబాబ్వే 31 పరుగుల తేడాతో గెలుపొందింది.
జింబాబ్వే నిర్ధేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్.. 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి 100 లోపే ఆలౌటయ్యేలా కనిపించింది. కర్టిస్ క్యాంఫర్ (27), జార్జ్ డాక్రెల్ (24), గెరాత్ డెలానీ (24), బ్యారీ మెక్ కార్తీ (22 నాటౌట్) ఆ జట్టును ఆదుకునేందుకు విఫలయత్నం చేశారు. జింబాబ్వే బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో ఐర్లాండ్ తలవంచక తప్పలేదు. బ్లెసింగ్ ముజరబానీ 3, రిచర్డ్ నగరవ, టెండాయ్ చటారా తలో 2 వికెట్లు, సీన్ విలియమ్స్, సికందర్ రజా చెరో వికెట్ సాధించి ఐర్లాండ్ నడ్డి విరిచారు.
కాగా, ఇదే గ్రూప్‌లో ఇవాళ జరిగిన మరో మ్యాచ్‌లో పసికూన స్కాట్లాండ్.. రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ వెస్టిండీస్‌పై సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment