
కొలంబో: సొంతగడ్డపై 1992 తర్వాత తొలిసారి శ్రీలంక జట్టు ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. మంగళవారం చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన నాలుగో వన్డేలో లంక 4 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లంక 49 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ చరిత్ అసలంక (106 బంతుల్లో 110; 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించగా, ధనంజయ డిసిల్వ (61 బంతుల్లో 60; 7 ఫోర్లు) రాణించాడు.
అనంతరం ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 254 పరుగులకు ఆలౌటైంది. డేవిడ్ వార్నర్ (112 బంతుల్లో 99; 12 ఫోర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా, చివర్లో ప్యాట్ కమిన్స్ (43 బంతుల్లో 35; 2 ఫోర్లు) పోరాడాడు. ఒకదశలో 189/4తో లక్ష్యం దిశగా సాగుతున్నట్లు అనిపించిన ఆసీస్ వరుస వికెట్లతో ఓటమిని ఆహ్వానించింది. చివరి ఓవర్‌లో ఆస్ట్రేలియా విజయానికి 19 పరుగులు అవసరమయ్యాయి.
షనక వేసిన ఈ ఓవర్లో ఆసీస్ బ్యాటర్ కునెర్మన్ (12 బంతుల్లో 15; 3 ఫోర్లు) తొలి బంతిపై పరుగు తీయలేదు. ఆ తర్వాత 4,2,4,4తో 14 పరుగులు సాధించాడు. దాంతో ఆసీస్ గెలుపునకు ఆఖరి బంతికి 5 పరుగులు అవసరమయ్యాయి. అయితే చివరి బంతికి కునెర్మన్‌ను షనక అవుట్ చేసి ఈ సిరీస్‌లో లంకకు వరుసగా మూడో విజయాన్ని ఖరారు చేశాడు. లంక తరఫున ఎనిమిది మంది బౌలర్లు బౌలింగ్ వేయగా అందులో ఏడుగురు వికెట్లు తీయడం విశేషం.
ధనంజయ డిసిల్వా, వాండర్సె, చమిక కరుణరత్నే రెండేసి వికెట్లు తీయగా... తీక్షణ, హసరంగ, వెల్లలాగె, కెప్టెన్ దసున్ షనక ఒక్కో వికెట్ పడగొట్టారు. తాజా ఫలితంతో ఐదు వన్డేల సిరీస్‌ను లంక 3–1తో గెలుచుకోగా, చివరి మ్యాచ్ శుక్రవారం జరుగుతుంది. 2012 తర్వాత ఆస్ట్రేలియాపై శ్రీలంక వరుసగా మూడు వన్డేల్లో గెలుపొందడం విశేషం.