వన్డే వరల్డ్‌కప్-2023 ప్రారంభమై పది రోజులు పూర్తైనప్పటికీ ఫైవ్ టైమ్ వరల్డ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా, 1996 వరల్డ్‌కప్ విన్నర్ శ్రీలంక బోణీ విజయం కోసం పరితపిస్తూనే ఉన్నాయి. ఈ రెండు జట్లు ప్రస్తుత ఎడిషన్‌లో చెరో రెండు మ్యాచ్‌లు ఆడినప్పటికీ.. ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేకపోయాయి.
ఆస్ట్రేలియా.. భారత్, సౌతాఫ్రికా చేతుల్లో పరాభవాలు ఎదుర్కొని ఎన్నడూ లేనట్లుగా పాయింట్ల పట్టికలో చివరినుంచి మొదటిస్థానంలో ఉండగా.. సౌతాఫ్రికా, పాకిస్తాన్ చేతుల్లో ఓటమిపాలైన శ్రీలంక పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో నిలిచింది. లక్నో వేదికగా ఇవాళ (అక్టోబర్ 16) తలపడనున్న ఈ ఇరు జట్లు.. గెలుపుపై గంపెడాశలు పెట్టుకుని బరిలోకి దిగనున్నాయి.
ప్రపంచకప్‌లో ఇరు జట్ల హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. శ్రీలంకపై ఆసీస్‌కు స్పష్టమైన ఆధిక్యత ఉంది. ఈ రెండు జట్లు ప్రపంచకప్ టోర్నీల్లో 11 సార్లు ఎదురెదురుపడగా.. 8 మ్యాచ్‌ల్లో ఆసీస్, 2 సందర్భాల్లో శ్రీలంక విజయం సాధించాయి. 1996 వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన శ్రీలంక.. ఆ ఎడిషన్‌లోనే రెండుసార్లు ఆసీస్‌పై గెలుపొందింది. గ్రూప్ మ్యాచ్‌లో వాకోవర్ లభించడంతో ఒక్క బంతి కూడా పడకుండానే విజేతగా నిలిచిన శ్రీలంక.. ఫైనల్లో ఆసీస్‌ను మట్టికరిపించి జగజ్జేతగా ఆవిర్భవించింది.
ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఇరు జట్ల ఫామ్‌ను పరిశీలిస్తే.. ఆసీస్‌తో పోలిస్తే శ్రీలంక పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పాలి. లంకేయులు బౌలింగ్ విషయంలో చాలా వీక్‌గా ఉన్నా.. బ్యాటింగ్‌లో మాత్రం భీకర ఫామ్‌లో ఉన్నారు. సౌతాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారీ లక్ష్య ఛేదనలోనూ (429) ఏమాత్రం తడబడని లంక బ్యాటర్లు గెలవలేమని తెలిసినప్పటికీ చివరి నిమిషం వరకు పోరాడారు. ఈ మ్యాచ్‌లో లంక బ్యాటర్లు కుశాల్ మెండిస్ (76), చరిత్ అసలంక (79), షనక (68) మెరుపు అర్ధశతకాలతో విజృంభించారు.
అనంతరం పాక్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ తొలుత బ్యాటింగ్ చేస్తూ చెలరేగిన లంక బ్యాటర్లు 344 పరుగుల భారీ స్కోర్‌ను చేశారు. అయితే బౌలర్లు విఫలం కావడంతో ఈ మ్యాచ్‌లో కూడా ఆ జట్టు ఓడింది. సౌతాఫ్రికాపై చెలరేగిన కుశాల్ మెండిస్ ఈ మ్యాచ్‌లోనూ (122) పట్టపగ్గాల్లేకుండా విజృంభించాడు. అతనితో పాటు సమరవిక్రమ కూడా శతక్కొట్టాడు. నిస్సంక (51) అర్ధసెంచరీతో రాణించాడు.
మరోవైపు ఆసీస్ రెండు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమైంది. టీమిండియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తూ 199 పరుగులకే కుప్పకూలిన ఆస్ట్రేలియన్లు.. ఆతర్వాత చిన్న స్కోర్‌ను డిఫెండ్ చేసుకోవడంలో కూడా చేతులెత్తేశారు. సౌతాఫ్రికాతో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ ఇదే సీన్ రిపీటైంది.ఈ మ్యాచ్‌లోనూ ఆస్ట్రేలియన్లు అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమయ్యారు. తొలుత బౌలింగ్ చేస్తూ ప్రత్యర్ధిని 311 పరుగులు చేయనిచ్చిన ఆస్ట్రేలియన్లు.. ఆతర్వాత బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమై 177 పరుగులకే కుప్పకూలారు.
Comments
Please login to add a commentAdd a comment