శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో పాకిస్తాన్ మిడిలార్డర్ బ్యాటర్ సౌద్ షకీల్ చరిత్ర సృష్టించాడు. శ్రీలంకలో డబుల్ సెంచరీ (208 నాటౌట్) సాధించిన తొలి పాకిస్తాన్ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో శ్రీలంకలో అత్యధిక స్కోర్ రికార్డు మహ్మద్ హఫీజ్ (196) పేరిట ఉండేది. ఈ మ్యాచ్‌లో షకీల్.. హఫీజ్ రికార్డును తిరగరాశాడు. కెరీర్‌లో ఆడుతున్నది ఆరో టెస్ట్ మ్యాచే అయినా ఎంతో అనుభవజ్ఞుడిలా బ్యాటింగ్ చేసిన షకీల్.. వ్యక్తిగత రికార్డుతో పాటు టెయిలెండర్ల సహకారంతో తన జట్టుకు అతిమూల్యమైన పరుగులు సమకూర్చాడు.
జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (73/4) బరిలోకి దిగిన షకీల్.. అఘా సల్మాన్ (83), నౌమన్ అలీ (25), నసీం షా (78 బంతుల్లో 6) సాయంతో తన జట్టుకు భారీ స్కోర్ అందించాడు. షకీల్ సూపర్ డబుల్ సెంచరీతో కదం తొక్కడంతో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 461 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బౌలర్లలో రమేశ్ మెండిస్ 5 వికెట్లతో చెలరేగగా.. ప్రభాత్ జయసూర్య 3, విశ్వ ఫెర్నాండో, కసున్ రజిత తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 312 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. ధనంజయ డిసిల్వ (122) సెంచరీతో కదం తొక్కగా.. ఏంజెలో మాథ్యూస్ అర్ధసెంచరీతో (64) రాణించాడు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, నసీం షా, అబ్రార్ అహ్మద్ తలో 3 వికెట్లు, అఘా సల్మాన్ ఓ వికెట్ పడగొట్టాడు.
కాగా, కెరీర్‌లో 11 ఇన్నింగ్స్‌ల్లో 2 సెంచరీలు, 5 అర్ధసెంచరీల సాయంతో 98.50 సగటున 788 పరుగులు చేసిన షకీల్‌పై సోషల్‌మీడియా ప్రశంసల వర్షం కురిపిస్తుంది. పాక్ అభిమానులు 27 ఏళ్ల ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌ను ఆకాశానికెత్తుతున్నారు. టెస్ట్ క్రికెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్న డెవాన్ కాన్వే, హ్యారీ బ్రూక్‌లతో పోలుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment