
పాక్ బ్యాటర్ సౌద్ షకీల్ చరిత్ర సృష్టించాడు. 146 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఏడు టెస్ట్‌ల్లో కనీసం ఓ హాఫ్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 27 ఏళ్ల షకీల్ తన టెస్ట్ కెరీర్‌లో ఇప్పటివరకు 7 టెస్ట్ మ్యాచ్‌ల్లో 13 ఇన్నింగ్స్‌ల్లో 87.5 సగటున ఓ అజేయమైన డబుల్ సెంచరీ, అజేయమైన సెంచరీ, 5 హాఫ్ సెంచరీల (ఓ అజేయమైన హాఫ్ సెంచరీ) సాయంతో 875 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో షకీల్ వరుసగా (37 & 76), (63 & 94), (23 & 53), (22 & 55 నాటౌట్), (125 నాటౌట్ & 32), (208 నాటౌట్ & 30), 57 స్కోర్లు చేశాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏ ఆటగాడు.. తన తొలి 7 టెస్ట్‌ల్లో ఈ ఘనత సాధించింది లేదు.
కాగా, శ్రీలంక పర్యటనలో తొలి టెస్ట్ మ్యాచ్ నెగ్గి 2 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న పాక్.. లంకతో ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్‌లోనూ పట్టు బిగించింది. నాలుగో రోజు ఆటలో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను 576/5 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. దీంతో ఆ జట్టుకు 410 తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అబ్దుల్లా షఫీక్ (201) డబుల్ సెంచరీతో చెలరేగగా.. అఘా సల్మాన్ (132) అజేయ శతకంతో మెరిశాడు.
షాన్ మసూద్ (51), సౌద్ షకీల్ (57), మహ్మద్ రిజ్వాన్ (50 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించారు. అనంతరం 410 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన శ్రీలంక.. 27 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. నిషాన్ మధుష్క (33), దిముత్ కరుణరత్నే (41) ఔట్ కాగా.. కుశాల్ మెండిస్ (12), ఏంజెలో మాథ్యూస్ (4) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఇంకా రెండ్రోజుల ఆట (27, 28 తేదీలు) మిగిలి ఉంది. పాక్‌కే విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో పాక్ గెలిస్తే 2 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేస్తుంది.