కొలొంబో: వచ్చే నెలలో టీమిండియాతో జరగబోయే సిరీస్ విషయమై శ్రీలంక క్రికెట్ బోర్డు బీసీసీఐకి లేఖ రాసింది. రెండు టెస్ట్‌లు, 3 టీ20ల సిరీస్ ఆడేందుకు లంక జట్టు ఫిబ్రవరి 25న భారత్‌కు రావాల్సి ఉండగా.. ఈ సిరీస్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేయాలని ఆ దేశ క్రికెట్ బోర్డు బీసీసీఐని అభ్యర్ధించింది. షెడ్యూల్ ప్రకారం ఈ సిరీస్‌లో తొలుత టెస్ట్‌లు, ఆతర్వాత టీ20లు జరగాల్సి ఉంది. అయితే, ఫిబ్రవరి 11 నుంచి 20 వరకు 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం లంక జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో ఆసీస్ పర్యటనకు కంటిన్యూయేషన్‌గా భారత్‌తో తొలుత టీ20లు, ఆ తర్వాత టెస్ట్ సిరీస్ నిర్వహిస్తే తమకు సౌకర్యవంతంగా ఉంటుందని ఎస్‌ఎల్‌సీ పేర్కొంది. దీని వల్ల ఆటగాళ్లను వెనక్కి పిలిపించే సమస్య ఉండదని విన్నవించుకుంది. ఆస్ట్రేలియాలో పర్యటించే జట్టునే భారత్‌కు పంపించే యోచనలో ఉన్నట్లు తెలిపింది. దీని వల్ల ప్రయాణ భారంతో పాటు బయో బబుల్ సమస్య కూడా తలెత్తదని వివరించింది.
కాగా, ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం భారత్-శ్రీలంక జట్ల మధ్య ఫిబ్రవరి 25న తొలి టెస్ట్, మార్చి 5న రెండో టెస్ట్, అనంతరం మార్చి 13,15,18 తేదీల్లో మూడు టీ20లు జరగాల్సి ఉంది. ఇదిలా ఉంటే, దేశంలో కరోనా స్వైర విహారం చేస్తున్న నేపథ్యంలో లంకతో సిరీస్‌ను ముందుగా ప్రకటించిన విధంగా నాలుగు వేదికల్లో(బెంగళూరు, మొహాలి, ధర్మశాల, లక్నో) కాకుండా రెండు వేదికల్లోనే కుదించేందుకు బీసీసీఐ యోచిస్తోంది. బెంగళూరు, లక్నో నగరాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో మొహాలి, ధర్మశాలల్లో మ్యాచ్‌లను నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు భావిస్తుంది.
చదవండి: వికెట్ పడగొట్టాడు.. శ్రీవల్లి పాటకు స్టెప్పులేశాడు
Comments
Please login to add a commentAdd a comment