భారత మహిళా క్రికెట్ జట్టు సూపర్ స్టార్ స్మృతి మంధాన అభిమానులకు శుభవార్త అందించింది. తన మనసులో చోటు దక్కించుకున్న ప్రత్యేకమైన వ్యక్తి ఇతడేనంటూ సంకేతాలు ఇచ్చింది.
అనుబంధానికి ఐదేళ్లు
సంగీతకారుడు, ఫిల్మ్ మేకర్ పలాష్ ముచ్చల్‌తో తన అనుబంధాన్ని అధికారికంగా ప్రకటించింది. స్మృతితో కలిసి కేక్ కట్ చేసిన పలాష్.. ‘‘ఐదు’’ అంటూ హార్ట్ ఎమోజీ జత చేశాడు. తమ ప్రేమ బంధానికి ఐదు వసంతాలు నిండాయన్న అర్థంలో క్యాప్షన్ జతచేశాడు.
మీ జంట సూపర్ అంటూ
ఇందుకు స్పందనగా.. స్మృతి మంధాన లవ్ సింబల్స్‌తో తన సంతోషాన్ని తెలియజేసింది. ఈ నేపథ్యంలో మీ జంట సూపర్ అంటూ సెలబ్రిటీలు రుబీనా దిలాయక్, పార్థ్ సమర్థన్ సహా అభిమానులు స్మృతి- పలాష్‌లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇక పలాష్ సోదరి పాలక్ సైతం వీరి బంధాన్ని ధ్రువీకరించేలా కామెంట్ చేయడం గమనార్హం. కాగా భారత టీ20 జట్టు కెప్టెన్ స్మృతి మంధాన 1996 జూలై 18న ముంబైలో జన్మించింది. తొమ్మిదేళ్ల వయసులో క్రికెట్ బ్యాట్ పట్టిన ఈ లెఫ్టాండర్.. 2014లో టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చింది.
భారత మహిళా క్రికెట్ జట్టులో కీలక సభ్యురాలిగా ఎదిగి మూడు ఫార్మాట్లలో సత్తా చాటుతున్న మంధాన.. ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకుంది.
అంతేకాదు వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో అత్యధిక ధర(రూ. 3 కోట్ల 40 లక్షలు)కు అమ్ముడుపోయిన క్రికెటర్‌గా మంధాన చరిత్ర సృష్టించింది. తాజా డబ్యూపీఎల్ సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును విజేతగా నిలిపి కెప్టెన్‌గా నీరాజనాలు అందుకుంది.
ఎవరీ పలాష్ ముచ్చల్?
ఇక మంధాన వ్యక్తిగత జీవితానికి వస్తే.. 29 ఏళ్ల మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్‌తో ఆమె ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ సింగర్ పాలక్ ముచ్చల్ సోదరుడే పలాష్.
సూపర్ స్టార్లు సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ సినిమాల్లో పాలక్ పాడగా.. మ్యూజిక్ కంపోజర్‌గా పలాష్ అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. టీ- సిరీస్, జీ మ్యూజిక్ కంపెనీ, పాల్ మ్యూజిక్ వంటి కంపెనీలతో మమేకమై 40కి పైగా మ్యూజిక్ వీడియోలు చేశాడు.
అంతేకాదు.. అభిషేక్ బచ్చన్, దీపికా పదుకునే నటించిన ఖేలే హమ్ జీ జాన్ సే చిత్రంలోనూ పలాష్ కీలక పాత్ర పోషించాడు. అదే విధంగా వెబ్ సిరీస్ డైరెక్టర్‌గానూ పేరు తెచ్చుకున్నాడు పలాష్ ముచ్చల్.
Comments
Please login to add a commentAdd a comment