
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత స్టార్ టెబుల్ టెన్నిస్ ప్లేయర్, తెలుగమ్మాయి ఆకుల శ్రీజ పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నెం1 ఇంగ్షా షున్(చైనా) చేతిలో శ్రీజ ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో శ్రీజ 10-12, 10-12, 8-11, 3-11 తేడాతో పరాజయం పాలైంది.
తొలి మూడు సెట్లలో ప్రత్యర్ధికి గట్టి పోటీ ఇచ్చిన శ్రీజ.. కీలకమైన నాలుగో సెట్‌లో మాత్రం తేలిపోయింది. కాగా టీటీ మహిళల సింగిల్స్‌లో ప్రీక్వార్టర్స్‌కు చేరిన రెండో భారత ప్లేయర్‌గా శ్రీజ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. మరో భారత స్టార్ పెడ్లర్ మనికా బత్రా కథ కూడా ముగిసింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 28వ ర్యాంకర్ మనిక 6–11, 9–11, 14–12, 8–11, 7–11తో ప్రపంచ 13వ ర్యాంకర్ మియు హిరానో (జపాన్) చేతిలో ఓడిపోయింది.