ఐపీఎల్ వేలం వేదిక వద్ద సన్‌రైజర్స్ హైదరాబాద్ బృందం ఏం చేస్తోంది? సగటు అభిమానికి రెండు రోజులుగా ఇదే సందేహం వచ్చింది. ఇతర జట్లతో పోలిస్తే సన్‌రైజర్స్ వేలం దశ దిశ లేకుండానే సాగినట్లుగా అనిపిస్తోంది. అసలు వేలానికి ముందు ఏదైనా ‘హోం వర్క్’ చేసి వచ్చారా లేక టేబుల్‌పైనే నిర్ణయాలు తీసుకున్నారా అని అనిపించింది. వ్యూహాత్మకంగా డబ్బులను ఉపయోగించడంలో ఆ జట్టు బాగా విఫలమైంది. మొదటి నుంచి టీమ్ మిడిలార్డర్ బ్యాటింగ్ బలహీనం. కొన్ని బంతుల్లోనే మ్యాచ్ రాత మార్చే ఒక్క విధ్వంసక ఆటగాడు ఈసారి కూడా జట్టులో లేడు.
చదవండి: IPL 2022 Auction: వేలంలో వారికి పంట పండింది.. వీళ్లను అసలు పట్టించుకోలేదు
తాజా ఫామ్, నిలకడను బట్టి చూస్తే విండీస్ వికెట్ కీపర్ నికోలస్ పూరన్‌కు రూ. 10 కోట్ల 75 లక్షల చాలా ఎక్కువ. విండీస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రొమారియో షెఫర్డ్‌కు మరీ రూ. 7 కోట్ల 75 లక్షలు ఇచ్చి తీసుకోవడం అనూహ్యం. బౌలింగ్‌లో అతని అంతర్జాతీయ టి20 కెరీర్ ఎకానమీ 11.33 అంటే ఎంతో అధ్వానం! ఫ్రాంచైజీ యజమానులు కరీబియన్ ప్రీమియర్ లీగ్ ప్రదర్శనపైనే ఆధారపడ్డారా అనిపించింది. ఎవరూ పట్టించుకోని న్యూజిలాండ్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్‌కు రూ. కోటీ 50 లక్షలు, ఒకే ఒక అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన అఫ్గానినిస్తాన్ లెఫ్టార్మ్ పేసర్ ఫజల్ హఖ్‌కు రూ. 50 లక్షలు, ఫామ్ కోల్పోయి చాలా కాలంగా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమైన దక్షిణాఫ్రికా ప్లేయర్ మార్క్‌రమ్‌కు రూ. 2 కోట్ల 60 లక్షలు, అసలు సీన్‌లోనే లేని సీన్ అబాట్ (ఆస్ట్రేలియా)కు రూ. 2 కోట్ల 40 లక్షలు... ఇలా సన్‌రైజర్స్ ఖర్చు చేసింది. వరుస గాయాలతో బాధపడుతున్న విలియమ్సన్ కోలుకొని జట్టుకు బ్యాటింగ్‌పరంగా ఎంతగా ఉపయోగపడతాడనేది ఒక సందేహం కాగా... మిగిలిన ఏడుగురు విదేశీ ఆటగాళ్లలో ఒక్కరు కూడా వార్నర్, రషీద్ ఖాన్‌ల తరహాలో సింగిల్ హ్యాండ్‌తో మ్యాచ్ గెలిపించే సత్తా ఉన్నవారు లేరు!
వీళ్లూ అంతంతే...
భారత క్రికెటర్లకు ఎంచుకునే విషయంలో కూడా సన్‌రైజర్స్ ఎక్కడా దూకుడు కనిపించలేదు. తొలి రోజే రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మలకు స్థాయికి మించి మొత్తాలు ఆఫర్ చేసిన టీమ్ రెండో రోజు కూడా పెద్దగా గుర్తింపు లేని ఆటగాళ్లనే వరుసగా ఎంచుకుంది. ఓపెనర్‌గా కెరీర్ బ్యాటింగ్ స్ట్రయిక్ రేట్ కనీసం 100 కూడా లేని ఆర్.సమర్థ్ సామర్థ్యంపై రైజర్స్ నమ్మకముంచింది! సౌరభ్ దూబే (విదర్భ), శశాంక్ సింగ్ (ఛత్తీస్‌గఢ్), విష్ణు వినోద్ (కేరళ), జె. సుచిత్ (కర్ణాటక), ప్రియమ్ గార్గ్ (యూపీ)... వీరంతా జట్టు విలువను పెంచగలరా!
చదవండి: IPL 2022 Mega Auction: కేఎల్ రాహుల్ కెప్టెన్సీ.. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఇదే
హైదరాబాదీలు లేని టీమ్...
ఒక్క హైదరాబాద్ క్రికెటర్... పోనీ దేశవాళీలో ఆంధ్ర జట్టుకు ఆడుతున్నా సరే, ఒక తెలుగు ఆటగాడు... సన్‌రైజర్స్ టీమ్‌కు తమ జట్టులో చేర్చుకునేందుకు ఎవరూ దొరకలేదు. హైదరాబాద్, ఆంధ్ర జట్ల నుంచి కనీసం ‘నామ్‌కే వాస్తే’గానైనా ఒకరిని హైదరాబాద్ టీమ్‌లో తీసుకునే సాహసం చేయలేదు! హోం సిటీ ఆటగాళ్లను జట్టులోకి చేర్చుకునే విషయంలో మొదటినుంచీ సన్‌రైజర్స్ వ్యవహార శైలి ఇలాగే ఉంటోంది. నిజమైన హైదరాబాద్ అభిమానులు ఇతర ఫ్రాంజైజీల తరహాలో ‘ఇది మా టీమ్’ అంటూ గర్వంగా ఎప్పుడూ చెప్పుకునే అవకాశం ఫ్రాంచైజీ ఇవ్వలేదు. ఈసారి కూడా 25 మంది సభ్యుల టీమ్‌లో హైదరాబాద్ లేదా ఆంధ్రకు చెందిన ఒక్క ప్లేయర్ కూడా సన్‌రైజర్స్ టీమ్‌లో లేడు. గొప్ప ఆటగాళ్లు, అద్భుత ప్రదర్శనల సంగతి తర్వాత... ఐపీఎల్ ఫ్యాన్స్ టీమ్‌తో కనెక్ట్ కావడానికి లోకల్ ప్లేయర్స్ కూడా ఒక కారణం అవుతారు. కానీ సన్‌రైజర్స్ మాత్రం అలా ఎప్పుడూ ఆలోచించలేదు.
‘షాక్‌కు గురి చేసింది’
భారత క్రికెటర్ హనుమ విహారి పేరు కూడా వేలంలో వినిపించకపోవడం దురదృష్టకరం. ఎంతో మంది అనామకులకు లీగ్‌లో అవకాశం దక్కిన చోట భారత టెస్టు జట్టు సభ్యుడికి కనీసం అవకాశం లభించకపోవడం నన్ను చాలా బాధపెట్టింది. ఫ్రాంచైజీలు ఏం ఆలోచించాయో తెలీదు. ఏదో ఒక జట్టుకు ఎంపికవుతాడని నేను ఊహించిన దేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీ టాప్ స్కోరర్ తన్మయ్ అగర్వాల్‌ను కూడా తీసుకోకపోవడం ఆశ్చర్యకరం. ప్రతిభ గల ఆంధ్ర క్రికెటర్లు రికీ భుయ్, స్టీఫెన్, పృథ్వీరాజ్‌లకు కూడా అవకాశం దక్కకపోవడం నిరాశ కలిగించింది.
–ఎమ్మెస్కే ప్రసాద్, మాజీ చీఫ్ సెలక్టర్
Comments
Please login to add a commentAdd a comment