
సౌత్ ఆస్ట్రేలియా: ఇటీవల కాలంలో క్రికెట్‌లో మన్కడింగ్ మాట ఎక్కువగా వినిపిస్తోంది. బౌలర్ బంతిని విసరకముందే బ్యాట్స్‌మన్ క్రీజ్‌ను దాటి వెళితే అతన్ని మన్కడింగ్ ద్వారా ఔట్ చేయవచ్చు. ఇది ఐసీసీ నిబంధనల్లో భాగమే. ఈ సీజన్ ఐపీఎల్‌లో ఆర్సీబీతో మ్యాచ్‌లో అరోన్ ఫించ్ క్రీజ్‌ను దాటి వెళ్లినా ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జస్ట్ వార్నింగ్‌తో సరిపెట్టాడు. గతేడాది రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్‌ను మన్కడింగ్ ద్వారా ఔట్ చేయడంతో అశ్విన్ వార్తల్లో నిలిచాడు. ఆ సమయంలో కింగ్స్ పంజాబ్ తరఫున ఆడిన అశ్విన్ చర్య క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని పలువురు అభిప్రాయపడ్డారు. దాంతోనే ఈ ఏడాది ఫించ్‌ను మన్కడింగ్ ద్వారా ఔట్ చేసే అవకాశం వచ్చినా అశ్విన్ వెనక్కి తగ్గి కేవలం వార్నింగ్‌తో సరిపెట్టాడు. (ప్లేఆఫ్స్ రేసు: ఎవరికి ఎంత అవకాశం?)
కాగా, తాజాగా ఆస్ట్రేలియా దేశవాళీ సీజన్‌లో భాగంగా షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో మన్కడింగ్ చేస్తానంటూ క్వీన్స్‌లాండ్ ఆటగాడు లబూషేన్‌కు న్యూసౌత్ వేల్స్ పేసర్ అయిన మిచెల్ స్టార్క్ వార్నింగ్ ఇచ్చాడు. క్వీన్స్‌లాండ్ ఇన్నింగ్స్‌లో భాగంగా 48 ఓవర్ ఐదో బంతికి ముందు స్టార్క్ పరుగెత్తుకుంటూ వచ్చి బంతిని వేయడాన్ని ఆపేశాడు. ఆ క్రమంలోనే నాన్ స్టైకర్ ఎండ్‌లో ఉన్న లబూషేన్‌ను క్రీజ్‌లో ఉండమంటూ హెచ్చరించాడు. ఈ చర్యతో లబూషేన్ కాస్త ఆశ్చర్యానికి గురయ్యాడు. తాను క్రీజ్‌లో ఉన్నప్పటికీ ఇలా చెప్పడం ఏమిటని స్టార్క్‌ను తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. తాను క్రీజ్‌ను దాటి బయటకు వెళ్లలేదనే విషయాన్ని తన చేష్టల ద్వారా చెప్పాడు లబూషేన్. స్టార్క్‌ను ఏదో అడగబోతే అతను ఏదో అనుకుంటూ బంతిని వేయడానికి బౌలింగ్ ఎండ్‌కు చేరుకున్నాడు. క్వీన్స్‌లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో లబూషేన్ సెంచరీ చేశాడు. 203 బంతుల్లో 16 ఫోర్లతో 117 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
A warning from Mitch Starc to Marnus Labuschagne 🙊 #SheffieldShield pic.twitter.com/iGGQU7lItP
— cricket.com.au (@cricketcomau) October 30, 2020