T20I: భారీ రికార్డుపై కన్నేసిన సూర్యకుమార్‌.. | Suryakumar Yadav On Cusp Of History Set To Join Kohli Rohit In Exclusive List | Sakshi
Sakshi News home page

భారీ రికార్డుపై కన్నేసిన సూర్యకుమార్‌.. ఇంకో 160 పరుగులు చేస్తే

Published Thu, Jul 18 2024 12:41 PM | Last Updated on Thu, Jul 18 2024 1:35 PM

Suryakumar Yadav On Cusp Of History Set To Join Kohli Rohit In Exclusive List

పొట్టి క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు టీమిండియా స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌. అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అనతికాలంలోనే ఐసీసీ వరల్డ్‌ నంబర్‌ వన్‌ బ్యాటర్‌గా ఎదిగాడు.

ప్రస్తుతం టీమిండియా తరఫున టీ20లలో అగ్ర బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు సూర్య. అన్నీ కుదిరితే భారత జట్టు కెప్టెన్‌గానూ ఈ మిస్టర్‌ 360 డిగ్రీ ప్లేయర్‌ను చూసే అవకాశం ఉంది.

శ్రీలంకతో టీ20 సిరీస్‌ సందర్భంగా ఇందుకు సంబంధించిన ప్రకటన రావొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా జూలై 27 నుంచి టీమిండియా- శ్రీలంక మొదలుకానున్న ఈ సిరీస్‌తోనే గౌతం గంభీర్‌ టీమిండియా హెడ్‌కోచ్‌గా తన ప్రయాణం మొదలుపెట్టునున్నాడు.

ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌-2024 తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌ విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జింబాబ్వే పర్యటనకు వెళ్లిన భారత ద్వితీయ శ్రేణి జట్టుకు శుబ్‌మన్‌ గిల్‌ సారథ్యం వహించాడు. టీ20 సిరీస్‌ను 4-1తో గెలిచాడు.

ఇక ఇప్పుడు లంక టూర్‌ సందర్భంగా రీఎంట్రీ ఇవ్వనున్న సూర్యకుమార్‌ యాదవ్‌ భారీ రికార్డుపై కన్నేశాడు. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో గనుక స్కై.. 160 పరుగులు సాధిస్తే అరుదైన జాబితాలో చేరతాడు.

టీమిండియా తరఫున టీ20లలో 2500 పరుగులు పూర్తి చేసుకున్న మూడో భారత బ్యాటర్‌గా నిలుస్తాడు. ఇప్పటి వరకు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి మాత్రమే అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఘనత సాధించారు.

ఇక ఓవరాల్‌గా కూడా ఇంటర్నేషనల్‌ టీ20లలో రోహిత్‌ శర్మ(4231 పరుగులు) అత్యధిక పరుగుల వీరుడిగా రికార్డులకెక్కగా.. విరాట్‌ కోహ్లి(4188 పరుగులు) రెండో స్థానంలో ఉన్నాడు. వీరి తర్వాతి స్థానంలో పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం(4145 పరుగులు) ఉన్నాడు.

కాగా టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీలో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో భారత టీ20 కెప్టెన్‌గా రోహిత్‌ స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్‌ను ఎంపిక చేసేందుకు బీసీసీఐ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సూర్య 2021లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు.

ఇప్పటి వరకు ఈ రైట్‌హ్యాండ్‌ బ్యాటర్‌ 37 వన్డేలు, 68 టీ20లు, ఒక టెస్టు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 773, 2340, 8 పరుగులు చేశాడు. సూర్య ఖాతాలో నాలుగు అంతర్జాతీయ టీ20 సెంచరీలు ఉండటం విశేషం.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement