శ్రీలంకతో సిరీస్ సందర్భంగా టీమిండియా టీ20 జట్టు పూర్తిస్థాయి కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. పొట్టి ఫార్మాట్లో భారత్‌ను నంబర్ వన్‌గా నిలపడంతో పాటు టీ20 ప్రపంచకప్ అందించిన రోహిత్ శర్మ వారసత్వాన్ని కొనసాగించేందుకు సిద్ధమయ్యాడు. కొత్త కోచ్ గౌతం గంభీర్ మార్గదర్శనంలో జూలై 27న రెగ్యులర్ కెప్టెన్ హోదాలో తన తొలి మ్యాచ్ ఆడబోతున్నాడు.
జట్టులో అతడే కీలకం
ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్ టీమిండియా యువ క్రికెటర్‌పై ప్రశంసలు కురిపించాడు. జట్టులో అతడే కీలకం(ఎక్స్ ఫ్యాక్టర్) కాబోతున్నాడంటూ సదరు ఆటగాడి నైపుణ్యాలను కొనియాడాడు. సూర్య ప్రశంసించిన క్రికెటర్ మరెవరో కాదు అసోం ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్. దేశవాళీ క్రికెట్‌తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆకట్టుకుంటున్న ఈ రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు ఇటీవలే టీమిండియాలో అరంగేట్రం చేశాడు.
జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ సందర్భంగా శుబ్‌మన్ గిల్ కెప్టెన్సీలోని జట్టుకు ఎంపికైన రియాన్ పరాగ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ టూర్‌లో మూడు మ్యాచ్‌లు ఆడి కేవలం 25 పరుగులే చేశాడు. అయినప్పటికీ ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ను సెలక్టర్లు శ్రీలంక పర్యటనకు ఎంపిక చేశారు.
అతడే ఎందుకంటూ విమర్శలు
అంతేకాదు వన్డే జట్టులోనూ తొలిసారిగా చోటిచ్చారు. జింబాబ్వే సిరీస్‌లో సెంచరీ చేసిన అభిషేక్ శర్మ, అద్భుతంగా రాణించిన రుతురాజ్ గైక్వాడ్ వంటి వాళ్లను పక్కనపెట్టి రియాన్‌ను సెలక్ట్ చేయడం విమర్శలకు దారితీసింది. అయితే, ఆల్‌రౌండర్ ప్రతిభ కారణంగానే అతడికి జట్టులో చోటు దక్కాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
పూర్తిగా మారిపోయాడు
ఈ నేపథ్యంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రియాన్ పరాగ్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేయడం విశేషం. ‘‘అన్ని రకాల క్రీడల్లో ట్రోలింగ్ అనేది కామన్. అయితే, దానిని మనం ఎలా అధిగమిస్తామన్నదే ముఖ్యం. రియాన్ పరాగ్ ప్రతిభావంతుడు. జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్నపుడే.. ఏ జట్టులోనైనా అతడొక ఎక్స్ ఫ్యాక్టర్ అవగలడని అంచనా వేశాను. ఇప్పుడు తను పూర్తిగా మారిపోయాడు.
విమర్శల నుంచి పాఠాలు నేర్చుకుంటున్నాడు. గత రెండేళ్లుగా దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటుతున్నాడు. ఇప్పుడు అతడు మా జట్టుతో ఉండటం సంతోషం’’ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. కాగా రియాన్ పరాగ్ విఫలమైనప్పుడల్లా అతడిపై నెట్టింట తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక లంకతో మొదటి టీ20లో మాత్రం రియన్‌కు తుదిజట్టులో చోటు దక్కే ఛాన్స్ లేదు!
Comments
Please login to add a commentAdd a comment