ఫోర్లు, సిక్సర్ల వర్షం.. సామ్‌ కరన్‌ తొలి టీ20 సెంచరీ | T20 Blast 2024, Surrey vs Hampshire: Sam Curran Huge 6 To Reach Maiden T20 Hundred | Sakshi
Sakshi News home page

ఫోర్లు, సిక్సర్ల వర్షం.. సామ్‌ కరన్‌ తొలి టీ20 సెంచరీ

Published Fri, Jul 19 2024 11:48 AM | Last Updated on Fri, Jul 19 2024 12:05 PM

T20 Blast 2024, Surrey vs Hampshire: Sam Curran Huge 6 To Reach Maiden T20 Hundred

సామ్‌ కర్రన్‌ (PC: T20 Blast)

ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కర్రన్‌ టీ20 క్రికెట్‌లో తొలి శతకం సాధించాడు. టీ20 బ్లాస్ట్‌ లీగ్‌లో భాగంగా హాంప్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ సర్రే క్రికెటర్‌.. 102 పరుగులతో అజేయంగా నిలిచి సత్తా చాటాడు.

లండన్‌లోని కెన్నింగ్‌టన్‌ ఓవల్‌ వేదికగా సర్రే- హాంప్‌షైర్‌ జట్లు గురువారం రాత్రి తలపడ్డాయి. టాస్‌ గెలిచిన సర్రే టీమ్‌ తొలుత బౌలింగ్‌ చేసింది.

హాంప్‌షైర్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ జేమ్స్‌ వినిస్‌(11 బంతుల్లో 23) ఫర్వాలేదనిపించగా.. ఐదో నంబర్‌ బ్యాటర్‌ టోబీ అల్బర్ట్‌ 66 పరుగులతో రాణించాడు.

వీరిద్దరి విజృంభణ నేపథ్యంలో 183 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే, దురదృష్టవశాత్తూ టోబీ రనౌట్‌ కావడం, మిగిలిన బ్యాటర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోవడంతో 19.5 ఓవర్లలోనే హాంప్‌షైర్‌ ఆలౌట్‌ అయింది.

సామ్‌ కర్రన్‌ ఫోర్లు, సిక్సర్ల వర్షం
ఇక లక్ష్య ఛేదనకు దిగిన సర్రేకు ఆరంభంలోనే చుక్కెదురైంది. ఓపెనర్‌ విల్‌ జాక్స్‌ 6 పరుగులకే నిష్క్రమించాడు. మరో ఓపెనర్‌ డొమినిక్‌ సిబ్లే 27 పరుగులతో ఫర్వాలేదనిపించినా.. ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన లారీ ఇవాన్స్‌(8), రోరీ బర్ర్స్‌(7) చేతులెత్తేశారు.

ఈ క్రమంలో ఇన్నింగ్స్‌ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న సామ్‌ కర్రన్‌.. ధనాధన్‌ దంచికొట్టాడు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ సెంచరీ కొట్టిన.. సామ్‌ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు ఉండటం విశేషం.

ఇక ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో 20 ఓవర్‌ తొలి బంతికే సిక్సర్‌ బాదిన సామ్‌ కర్రన్‌ వంద పరుగుల మార్కు అందుకోవడంతో పాటు.. జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. సామ్‌ కర్రన్‌ అద్భుత ఇన్నింగ్స్‌ కారణంగా హాంప్‌షైర్‌పై సర్రే 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఏమిటీ టీ20 బ్లాస్ట్‌ లీగ్‌?
రెండు దశాబ్దాలకు పైగా చరి త్ర ఉన్న  టీ20 లీగ్‌ ఈ టీ20 బ్లాస్ట్‌. ఇంగ్లండ్‌- వేల్స్‌ క్రికెట్‌ బోర్డు 2003లో ఈ పొట్టి లీగ్‌ను మొదలుపెట్టింది.

తొలుత దీనిని ట్వంటీ20 కప్‌(2003- 2009)గా పిలిచేవారు. ఆ తర్వాత నాలుగేళ్లపాటు ఫ్రెండ్స్‌లైఫ్‌ టీ20గా.. 2017 వరకు న్యూయెస్ట్‌ టీ20 బ్లాస్ట్‌.. ప్రస్తుతం విటలిటీ బ్లాస్ట్‌గా పిలుస్తున్నారు.

ఈ లీగ్‌లో 18 ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ దేశాలు పాల్గొంటాయి. వీటిని నార్త్‌, సౌత్‌ గ్రూపులుగా విభజిస్తారు. సాధారణంగా మే- సెప్టెంబరు మధ్య కాలంలో ఈ లీగ్‌ను నిర్వహిస్తారు. టీ20 బ్లాస్ట్‌-2024 సీజన్‌ మే 30న మొదలైంది. సెప్టెంబరు 14న ఫైనల్‌ మ్యాచ్‌తో ముగియనుంది.

నార్త్‌ గ్రూప్‌ జట్లు
డెర్బీషైర్‌ ఫాల్కన్స్‌, దుర్హాం, లంకాషైర్‌ లైటెనింగ్‌, లీసెస్టర్‌షైర్‌ ఫాక్సెస్‌, నార్తాంప్టన్‌షైర్‌ స్టీల్‌బాక్స్‌, నాట్స్‌ అవుట్‌లాస్‌(నాటింగ్హాంషైర్‌), బర్మింగ్‌హాం బేర్స్‌(విర్విక్‌షైర్‌), వర్సెస్టైర్‌షైర్‌ ర్యాపిడ్స్‌, సార్క్‌షైర్‌ వికింగ్స్‌.

సౌత్‌ గ్రూపు జట్లు
ఎసెక్స్‌ ఈగల్స్‌, గ్లామోర్గాన్‌, గ్లౌసెస్టర్‌షైర్‌, హాంప్‌షైర్‌, కెంట్‌ స్పిట్‌ఫైర్స్‌, మిడిల్‌సెక్స్‌, సోమర్సెట్‌, సర్రే, ససెక్స్‌ షార్క్స్‌.

ఈ సీజన్‌లో ప్రస్తుతం నార్త్‌ గ్రూపు నుంచి బర్మింగ్‌హాం 18 పాయింట్లతో టాప్‌లో ఉండగా.. సౌత్‌ గ్రూపు నుంచి సర్రే 20 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement