
నికోలస్ పూరన్ (PC: ICC)
ఘోర పరాభవం.. కోలుకోలేని దెబ్బ: భావోద్వేగానికి లోనైన నికోలస్ పూరన్
ICC Mens T20 World Cup 2022 - West Indies vs Scotland, 3rd Match, Group B: ‘‘నిజంగా మాకిది ఘోర పరాభవం. కోలుకోలేని దెబ్బ. నిరాశకు లోనయ్యాం. మేము మరింత కష్టపడాల్సి ఉంది. కచ్చితంగా రెండు మ్యాచ్‌లు గెలవాలి. ఈ ఓటమికి మేము బాధ్యత వహించాల్సిందే. జవాబుదారీగా ఉండాల్సిందే’’ అంటూ వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ భావోద్వేగానికి లోనయ్యాడు.
పేరుకే రెండుసార్లు చాంపియన్!
ఎవరికీ సాధ్యం కాని రీతిలో రెండుసార్లు టీ20 వరల్డ్‌కప్ గెలిచిన విండీస్ పరిస్థితి గతేడాది కాలంగా దారుణంగా తయారైన విషయం తెలిసిందే. పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్-2021లో విఫలమైన విండీస్ ఈసారి పసికూనలతో క్వాలిఫైయర్స్ ఆడాల్సిన పరిస్థితి తెచ్చుకుంది.
అయితే, అందునా టీ20 వరల్డ్‌కప్-2022లో తమ మొదటి మ్యాచ్‌లోనే స్కాట్లాండ్ చేతిలో పరాజయం పాలైంది పూరన్ బృందం. ఏకంగా 42 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. మిగిలిన రెండు మ్యాచ్‌లలో గనుక ఓడితే కనీసం సూపర్-12కు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది.
బాధగానే ఉంది.. కానీ పర్లేదు
ఈ నేపథ్యంలో కెప్టెన్ నికోలస్ పూరన్ మాట్లాడుతూ.. ఈ ఓటమి తమను తీవ్ర నిరాశకు గురిచేసిందని విచారం వ్యక్తం చేశాడు. అయితే, ఒక్క పరాజయంతో కుంగిపోవాల్సిన పనిలేదని, అలా చేస్తే తదుపరి మ్యాచ్‌పై ప్రభావం పడుతుంది కాబట్టి సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతామన్నాడు.
కాగా స్కాట్లాండ్ ఓపెనర్ జార్జ్ మున్సే 66 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టు మెరుగైన స్కోరు(160-5) చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన విండీస్ బ్యాటర్లను స్కాట్లాండ్ బౌలర్లు కట్టడి చేయడంతో విజయం వారి సొంతమైంది. మున్సే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే.. అక్టోబరు 19న వెస్టిండీస్ తమ తదుపరి మ్యాచ్‌లో జింబాబ్వేతో తలపడనుంది. ఆ తర్వాత ఐర్లాండ్‌తో పోటీ పడేందుకు సిద్ధమవుతోంది.
చదవండి: కొట్టాలనే మూడ్ లేదు.. ఆసీస్‌తో మ్యాచ్ సందర్భంగా సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
T20 WC: వారెవ్వా.. ‘ఏడాది’ తర్వాత జట్టులోకి.. ఒక్క ఓవర్.. 4 పరుగులు.. 3 వికెట్లు!