
విండీస్‌కు ఘోర పరాభవానికి కారణం అదేనన్న కెప్టెన్ పూరన్
ICC Mens T20 World Cup 2022 - West Indies vs Ireland- Nicholas Pooran: ‘‘ఈ ఓటమి తట్టుకోలేనిది. టోర్నమెంట్ ఆసాంతం మా బ్యాటింగ్ అస్సలు బాగాలేదు. బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై కూడా కేవలం 145- 146 పరుగులకే పరిమితం కావడంతో బౌలర్ల పని మరింత కష్టంగా మారింది. మా వల్ల వాళ్లు పెద్ద సవాలునే ఎదుర్కోవాల్సి వచ్చింది’’ అంటూ వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ విచారం వ్యక్తం చేశాడు. తమపై విజయం సాధించి టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12కు అర్హత సాధించిన ఐర్లాండ్‌కు శుభాకాంక్షలు తెలిపాడు.
గ్రూప్-బిలో భాగమైన వెస్టిండీస్ సూపర్-12కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఐర్లాండ్ చేతిలో ఘోర పరాజయం పాలైంది. బ్యాటింగ్ వైఫల్యం కారణంగా భారీ మూల్యమే చెల్లించింది. తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది ఈ మాజీ చాంపియన్.
మాకిది గుణపాఠం
ఈ నేపథ్యంలో విండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ ఐర్లాండ్‌తో మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. తమ ఓటమికి ప్రధాన కారణం బ్యాటింగ్ వైఫల్యమేనన్నాడు. ఐర్లాండ్ అద్బుతంగా బ్యాటింగ్ చేసిందని, బౌలర్లు కూడా రాణించారని ప్రత్యర్థి జట్టును అభినందించాడు.
అయితే, ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైనా జేసన్ హోల్డర్ బాగానే బౌలింగ్ చేశాడని.. బ్రాండన్ బ్యాటింగ్‌లో అదరగొట్టడం సానుకూల అంశాలని పేర్కొన్నాడు. ఐర్లాండ్ చేతిలో ఓటమి తమకో గుణపాఠమన్న పూరన్.. అభిమానులను తీవ్రంగా నిరాశపరిచామని విచారం వ్యక్తం చేశాడు. ఫ్యాన్స్‌ను వేదనకు గురిచేశామని.. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా తన ప్రదర్శన పట్ల చింతిస్తున్నట్లు పూరన్ తెలిపాడు. ఈ సందర్భంగా అతడు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. రెండుసార్లు చాంపియన్ అయిన తమ జట్టు ఇలా నిష్క్రమించడాన్ని తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యాడు.
కెప్టెన్‌గా, బ్యాటర్‌గా విఫలం
కాగా నెదర్లాండ్స్ పర్యటన నేపథ్యంలో ఈ ఏడాది జూన్‌లో విండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన నికోలస్ పూరన్ అటు బ్యాటర్‌గా.. ఇటు సారథిగా ఆకట్టుకోలేక పోతున్నాడు. నెదర్లాండ్స్‌తో వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్ చేసినా.. బ్యాటర్‌గా మాత్రం పూరన్ దారుణంగా విఫలమయ్యాడు. ఆ తర్వాత పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశ్ చేతిలో పలు సిరీస్‌లలోనూ ఇదే తరహాలో పరాభవం మూటగట్టుకున్నాడు.
వెస్టిండీస్ వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్ స్కోర్లు:
►టాస్: వెస్టిండీస్- బ్యాటింగ్
►వెస్టిండీస్ స్కోరు- 146/5 (20)
►ఐర్లాండ్ స్కోరు- 150/1 (17.3)
►ఫలితం: 9 వికెట్ల తేడాతో ఐర్లాండ్ విజయం
►ఈ మ్యాచ్‌లో నికోలస్ పూరన్ స్కోరు: 11 బంతుల్లో ఒక సిక్సర్ సాయంతో 13 పరుగులు
►విండీస్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్ బ్రాండన్ కింగ్: 48 బంతుల్లో 62 పరుగులు నాటౌట్
►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: గరెత్ డిలానీ(ఐర్లాండ్- 4 ఓవర్లలో 16 పరుగులు మూడు వికెట్లు)
చదవండి: T20 World Cup 2022: 'రిజ్వాన్, కోహ్లి, సూర్య కాదు.. అతడే ప్రపంచకప్ టాప్ రన్ స్కోరర్'
T20 WC 2022: పాకిస్తాన్‌కు ఊహించని షాక్.. కీలక బ్యాటర్ తలకు గాయం.. ఆస్పత్రికి తరలింపు