1970,80వ దశకంలో వెస్టిండీస్ జట్టు అంటేనే ప్రత్యర్థి జట్లు వణికిపోయేవి. అరవీర భయంకరంగా కనిపించే విండీస్ జట్టును చూస్తేనే ప్రత్యర్థి జట్టు మ్యాచ్‌లు ఓడిపోవాల్సిన దాఖలాలు కనిపించాయి. రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన విండీస్ విధ్వంసక ఆటగాళ్లకు పెట్టింది పేరు. వన్డేల్లో రెండు వరల్డ్‌కప్‌లు.. టెస్టుల్లో తిరుగులేని ఆధిపత్యం. ఆ తర్వాత టి20 ఫార్మాట్‌కే కొత్త వినోదాన్ని అందించిన విండీస్ జట్టు కొన్ని దశాబ్దాల కిందట రారాజుగా వెలుగొంది చివరకు పాతాళానికి పడిపోయింది.
ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించకపోవడమే ఒక వైఫల్యం కాగా, ఇప్పటి ప్రదర్శన వెస్టిండీస్ క్రికెట్‌కు మరో విషాదం! 90ల్లో టెస్టు క్రికెట్ చచ్చిపోయి...2000ల్లో వన్డే క్రికెట్‌లో పూర్తి ఓవర్లు కూడా ఆడలేని స్థాయికి దిగజారి... ఈ రెండూ లేకపోయినా, 2010 తర్వాత టి20 దూకుడుకు చిరునామాగా మారి అద్భుతాలు చూపించిన వెస్టిండీస్ ఇప్పుడు ఈ ఫార్మాట్‌లో కూడా దిగజారడం క్రికెట్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచే విషయం.
-సాక్షి, వెబ్‌డెస్క్
వెస్టిండీస్ జ్టటులో తప్పు ఎక్కడ జరిగిందనేది పక్కనబెడితే.. వారి ఓటమికి ఎన్నో కారణాలున్నాయి. ప్రపంచంలో ఎక్కడ టి20 లీగ్‌లు జరిగినా ముందుగా కనిపించేది వెస్టిండీస్ ఆటగాళ్లే. అలాంటి లీగ్స్‌లో వ్యక్తిగతంగా మెరుపులు మెరిపించే విండీస్ ఆటగాళ్లు టి20 ప్రపంచకప్ లాంటి మేజర్ టోర్నీలో ఒక జట్టు తరపున సమిష్టిగా ఆడడంలో మాత్రం విఫలమయ్యారు. జట్టుగా చూస్తే హిట్టర్లకు కొదువ లేదు. నికోలస్ పూరన్, ఎవిన్ లూయిస్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, జాసన్ హోల్డర్ ఇలా ఎవరికి వారే పొట్టి క్రికెట్‌లో మెరిపించడంలో దిట్ట.
ప్రపంచకప్‌లో విండీస్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగ్ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. కెప్టెన్ నికోలస్ పూరన్(5,7, 13 పరుగులు) అటు బ్యాటర్‌గా.. ఇటు కెప్టెన్‌గా పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ఎప్పుడో జట్టుకు దూరమైన జాసన్ హోల్డర్ ఆల్‌రౌండర్ అంటూ జట్టులోకి తీసుకొచ్చారు. కానీ అతను ఏ మాత్రం ప్రభావం చూపించకపోగా జట్టుకు భారమయ్యాడు. క్వాలిఫయింగ్ దశలో విండీస్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఎవరో ఒకరు రాణించారే తప్ప సమిష్టిగా ఆడిన దాఖలాలు ఎక్కడా కనిపించవు.
అసలు ఆడుతుంది వరల్డ్‌కప్ అన్న విషయం కూడా విండీస్ ఆటగాళ్లు మరిచినట్లున్నారు. సీరియస్‌గా మ్యాచ్‌ను కలిసి ఆడాల్సింది పోయి ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించారు. అసలు జట్టు కూర్పు కూడా సరిగ్గా లేదు. జట్టులో ఎంతమంది బ్యాటర్లు.. ఎంతమంది బౌలర్లు ఉండాలి.. ఏ సమయంలో ఎవరిని బ్యాటింగ్‌కు పంపాలి.. బౌలింగ్ ఎవరితో చేయించాలి అన్న కనీస పరిజ్ఞానం లేకుండా విండీస్ తమ ఆటను కొనసాగించి మూల్యం చెల్లించుకుంది.
2012, 2016 టి20 ప్రపంచకప్ విజేతలుగా నిలిచిన జట్టులో ఒక్కరంటే ఒక్కరు కూడా తుది జట్టులో లేకపోవడం పెద్ద మైనస్. రిటైర్ అయిన ఆటగాళ్ల సంగతి పక్కనబెడితే.. సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, హెట్‌మైర్, క్రిస్ గేల్ లాంటి కీలక ఆటగాళ్లను పక్కనబెట్టడం విండీస్ బోర్డు చేసిన పెద్ద తప్పు. వారు ఎలా ఆడతారన్నది ముఖ్యం కాదు. జట్టులో సీనియర్ ఆటగాళ్లు ఉంటే సమతుల్యం దెబ్బతినకుండా ఉంటుంది. ఈ చిన్న లాజిక్‌ను విండీస్ బోర్డు ఎలా మిస్ అయిందో అర్థం కాలేదు. పైగా హెట్‌మైర్ ఆఖరి నిమిషంలో విమానం ఎక్కకపోవడం అతని బాధ్యతారాహిత్యాన్ని చూపిస్తుంది. దేశం కోసం ఒక మేజర్ టోర్నీ ఆడుతున్నామన్న కసి హెట్‌మైర్‌లో ఏ కోశానా కనిపించలేదు.
ప్రైవేటు లీగ్స్ మోజులో పడి స్వంత దేశానికి ఆడడంలో నామోషీగా ఫీలవుతున్నారంటూ విండీస్ హెడ్‌కోచ్ గతంలో చేసిన వ్యాఖ్యలు అక్షరాలా నిజమయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో విండీస్ క్రికెట్ బోర్డును లేదా ఆటగాళ్లను తప్పుబట్టలేము. ఎందుకంటే బోర్డు సరిగ్గా ఉండి ఉంటే ఆటగాళ్లు ఇలా తయారయ్యేవారు కాదు. ప్రస్తుతం విండీస్ జట్టును పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిందే. ఆ సమయం ఆసన్నమైంది. ఇలాగే కొనసాగితే.. కొన్నేళ్ల పాటు క్రికెట్‌లో కనిపించకుండా పోయిన జింబాబ్వేలాగా తయారవ్వడం గ్యారంటీ.
కాగా టి20 ప్రపంచకప్‌లో విండీస్ ప్రదర్శనపై వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ రిక్కీ స్కెర్రిట్ సుదీర్ఘ లేఖ రాసుకొచ్చారు. జట్టు భవితవ్యంపై ఆందోళన చెందారు. ''టి20 ప్రపంచకప్‌లో మా జట్టు ప్రదర్శన నన్ను చాలా నిరుత్సాహానికి గురి చేసింది. క్రికెట్‌లో ఎంతో గొప్ప పేరున్న వెస్టిండీస్ ఆసీస్ గడ్డ నుంచి ఇలా అవమానకరరీతిలో వెనుదిరిగి వస్తుందని ఎవరు ఊహించలేదు. జట్టు సెలక్షన్‌లోనే పెద్ద తప్పు జరిగింది. టి20 ప్రపంచకప్ లాంటి మేజర్ టోర్నీకి ఎలాంటి జట్టును ఎంపిక చేయాలన్న విషయం పూర్తిగా విస్మరించాం.
మా భవిష్యత్తుపై పునరాలోచించుకోవాల్సిన సమయం వచ్చేసింది. జట్టుకు పోస్టుమార్టం జరగాల్సిందే. వరల్డ్‌కప్‌లో మేం చేసిన తప్పులు ఏంటి.. వాటిని ఎలా సరిదిద్దుకోవాలి అన్న విషయాలపై చర్చిస్తాం. వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు మునపటి వైభవం తీసుకొచ్చేలా ఆటగాళ్లను తయారు చేస్తాం. తక్షణ కర్తవ్యం జట్టు ప్రక్షాళన. ఇది చాలా అవసరం. ఇంత చెత్త ప్రదర్శనలోనూ మాకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. కచ్చితంగా మంచి కమ్‌బ్యాక్‌తో తిరిగి వస్తామని ఆశిస్తున్నా'' అంటూ ముగించాడు.
🚨 JUST IN 🚨
— Windies Cricket (@windiescricket) October 21, 2022
COMMENT BY CWI PRESIDENT RICKY SKERRITT. pic.twitter.com/fYVJSWy0mn
చదవండి: 'హెట్‌మైర్ శాపం తగిలింది.. అందుకే విండీస్‌కు ఈ దుస్థితి'
మా ఓటమికి ప్రధాన కారణం అదే.. ఇదో గుణపాఠం.. పూరన్ కన్నీటి పర్యంతం
Comments
Please login to add a commentAdd a comment