వరల్డ్ కప్ క్వాలిఫయర్స్-2023లో భాగంగా ఇవాళ (జూన్ 18) జరిగిన రెండో మ్యాచ్‌లో యూఎస్‌ఏపై వెస్టిండీస్ ఓ మోస్తరు విజయం సాధించింది. హరారేలోని తకషింగ స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో విండీస్ 39 పరుగుల తేడాతో గెలుపొందింది. విండీస్ ఆటగాళ్లు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించినప్పటికీ, వారికి విజయం అంత ఈజీగా దక్కలేదు. విండీస్‌తో పోల్చుకుంటే యూఎస్‌ఏ టీమ్ చాలా చిన్నదే అయినా అద్భుత పోరాటపటిమ కనబర్చింది.
తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్‌ను వారు మరో 3 బంతులు మిగిలుండగానే అలౌట్ చేశారు. విండీస్ జట్టులో గుర్తింపు పొందిన ఆటగాళ్లు చాలామంది ఉన్నప్పటికీ.. యూఎస్‌ఏ బౌలర్లు వారిని కట్టడి చేశారు. టీ20 స్పెషలిస్ట్‌లు అయిన బ్రాండన్ కింగ్ (0), కైల్ మేయర్స్ (2), రోవ్‌మన్ పావెల్ (0), కీమో పాల్ (4), అల్జరీ జోసఫ్ (3) ఆటలు యూఎస్‌ఏ బౌలర్ల ముందు సాగలేదు. స్టీవెన్ టేలర్, సౌరభ్ నేత్రావాల్కర్, కైల్ ఫిలిప్ తలో 3 వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించారు. జాన్సన్ ఛార్లెస్ (66), షాయ్ హోప్ (54), రోప్టన్ ఛేజ్ (55), జేసన్ హోల్డర్ (56), నికోలస్ పూరన్ (43) రాణించడంతో విండీస్ 49.3 ఓవర్లలో 297 పరుగులకు ఆలౌటైంది.
అనంతరం ఛేదనలో 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన యూఎస్‌ఏ ఆటగాళ్లు 7 వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేశారు. గజానంద్ సింగ్ (101 నాటౌట్) వీరోచిత శతకంతో పోరాడి విండీస్‌కు అంత సులువుగా విజయాన్ని దక్కనీయ లేదు. అతనికి ఆరోన్ జోన్స్ (23), షయాన్ జహంగీర్ (39), నోస్‌తుష్ కెంజిగే (34) సహకరించారు. విండీస్ బౌలర్లలో కైల్ మేయర్స్, అల్జరీ జోసఫ్ తలో 2 వికెట్లు, జేసన్ హోల్డర్, రోస్టన్ ఛేజ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
కాగా, ఇవాళే జరిగిన మరో గ్రూప్-ఏ మ్యాచ్‌లో నేపాల్‌పై జింబాబ్వే 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గ్రూప్-బిలో భాగంగా రేపు (జూన్ 19) శ్రీలంక-యూఏఈ.. ఐర్లాండ్-ఒమన్ జట్లు తలపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment